రాజీ పడొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల పారిశుద్ధ్య విషయంలో ఎలాంటి రాజీపడకూడదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదన్నారు. వసతి గృహాలను జాయింట్ ఇన్‌స్పెక్షన్ బృందాలు ప్రతిరోజూ తనిఖీ చేయాలని స్ప ష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ప్రతి రోజూ నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వసతి గృహాల్లో పారిశుద్ధ్యం పై ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. ఒకవేళ లోపా లు కనిపిస్తే సంబంధిత వార్డెన్లపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘వన్ హెల్త్’ విధానంతో సమన్వయం
సంక్రమణ వ్యాధుల నివారణకు రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫారసుల మేరకు ‘వన్ హెల్త్’ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ సూచించా రు. ఆరోగ్య, మున్సిపల్, విద్యాశాఖల మధ్య సమ న్వయం పటిష్టంగా ఉండాలని చెప్పారు. వసతి గృహాలు, పాఠశాలల్లో ఆహార భద్రత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై రాజీలేని తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాధుల నియంత్రణకు జిల్లా స్థాయి సంయుక్త తనిఖీ కమిటీలు అంతర్–శాఖీయ ర్యాపి డ్ రెస్పాన్‌న్స్ టీమ్‌లను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జెడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు పాల్గొన్నారు.
మద్యం మత్తులో డ్రైవింగ్
చిత్తూరు అర్బన్: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి చిత్తూరు కోర్టు జరిమానా విధించింది. జిల్లా ఎస్పీ తుషార్‌డూడి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ టి.సాయినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం మత్తులో వాహనా లు నడుపుతున్న ఏడుగురు పట్టుబడ్డారు. వీరి ని మంగళవారం చిత్తూరు ఫస్ట్ స్పెషల్ జుడీషి యల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి కె.పరిమళదేవి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించారు.


