ఇదేంది ‘తంబీ’!
కుప్పంరూరల్: మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పం అటవీ ప్రాంతంలో తమిళ ఆస్పత్రి వర్గాలు వ్యర్థాలు పడేస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నిప్పు పెట్టి వెళ్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఆస్పత్రి వ్యర్థాల నిర్వ హణపై గట్టి నిబంధనలు ఉండడంతో రాత్రి పూట ప్రత్యేక వాహనా ల్లో వచ్చి కుప్పం అటవీ ప్రాంతంలో పారబోసి నిప్పుపెడుతున్నారు. గత నెల రోజుల నుంచి ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తమిళ ఆస్పత్రి వ్యర్థాలు కుప్పం అడవుల్లో నిప్పులు రేపుతున్నాయి.
వేపనపల్లి నుంచే అధిక మొత్తంలో...
కుప్పం మండలం, గుడ్లనాయనపల్లి, తమిళనాడు రాష్ట్రం వేపనపల్లి మధ్య అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులోనూ వేపనపల్లి అతి సమీపంలో ఉంది. దీన్ని ఆసరాగా తీసుకున్న వేపనపల్లి, చుట్టు పక్కల పెద్ద ఎత్తున వెలిసిన ప్రైవేట్, ఆర్‌ఎంపీ క్లినిక్‌ల నుంచి నిత్యం వందల కిలోల వ్యర్థాలు వెలువడుతూనే ఉన్నాయి. ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణపై తమిళనాడులో నిబంధనలు కఠినంగా ఉండడంతో రాత్రి పూట ప్రత్యేక వాహనాల్లో గుడ్లనాయనపల్లి అటవీ ప్రాంతంలో పారబోసి, వ్యర్థాలకు నిప్పుపెట్టి వెళ్తున్నారు. అందులో రసాయనాలతో కూడిన విషపూరిత వ్యర్థాలు కూడా ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. గుడ్లనాయనపల్లి సమీపంలో అక్కడక్కడ పది చోట్ల వరకు పారబోసి నిప్పుపెట్టి వెళ్తున్నారు. పగటి పూట ఆ గాలి పీలిస్తే ఊపిరాడడం లేదని పశువులు, గొర్రెల కాపరులు వాపోతున్నారు. అదే విధంగా ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు ఓ రకమైన దుర్గంధం వస్తోందని చెబుతున్నారు. ఈ మెడికల్ డంపింగ్‌పై కుప్పం అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


