మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని ఎస్పీ తుషార్‌డూడి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభు త్వ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ నేటి యువతే రేపటి దేశ భవిష్యత్ అని అన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడితే వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజం, దేశం నష్టపోతుందన్నారు. మత్తు పదార్థాలు క్షణిక ఆనందం మాత్రమే ఇస్తాయని, కానీ జీవితాంతం వెంటాడే నష్టాన్ని మిగులుస్తాయన్నారు. డగ్స్ వద్దు–డ్రీమ్స్ కావాలి అనే నినాదాన్ని ప్రతి విద్యార్థి తన జీవిత సూత్రంగా మార్చుకోవాలన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని కొంతమంది అక్రమ రవాణాదారులు మోసపూరిత మార్గాల్లో డ్రగ్స్ వ్యాప్తి చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇటీవల కొన్ని పాఠశాలల్లో తనిఖీ చేయగా స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో పొగాకు ఉత్పత్తులు బయటపడటం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. చిన్న వయస్సులో ఇలాంటి అలవాట్లు మొదలైతే భవిష్యత్‌లో మరింత ప్రమాదకరమైన మత్తు పదార్థాల వైపు వెళ్తారన్నారు. అనంతరం పరీక్షల్లో రాణిస్తున్న, క్రీడాపోటీల్లో ప్రతిభ చాటుతున్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ తరుణ్‌పహ్వా, ఇంటర్మీడియట్ డీఐఈవో రఘుపతి, పీసీఆర్ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ మజీద్, డీఎస్పీ సాయినాథ్, సీఐలు మహేశ్వర, ఉమామహేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు చిట్టిబాబు పాల్గొన్నారు.


