కిషోర్, హేమప్రియ ప్రేమ వివాహం
ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులు
బంధువుల సమక్షంలో కర్మక్రియలు జరిపించిన వైనం
ఎస్‌ఆర్‌పురంలో వెలుగు చూసిన ఘటన
శ్రీరంగరాజపురం: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆ తండ్రి.. వెంటనే బంధువులను పిలిచి తన కూతురు చనిపోయిందని కర్మక్రియలు జరిపించాడు. పిండం పెట్టి.. నలుగురికీ భోజనాలు పెట్టాడు. ఎస్‌ఆర్ పురం మండలంలో గురువారం వెలుగు చూసిన ఈ ఘటన సంచలనం కలిగించింది.
స్థానికుల కథనం మేరకు.. శ్రీరంగరాజపురం మండలం పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన ఉష, సుబ్రమణ్యంరెడ్డి దంపతుల రెండో కుమార్తె హేమప్రియ తిరుపతిలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కిషోర్, హేమప్రియ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి తమ ప్రేమ సంగతి ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందామని భావించింది.
విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు ఒప్పుకోకపోవడంతో బుధవారం కిషోర్, హేమప్రియ ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. సుబ్రమణ్యం రెడ్డి దంపతులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. గురువారం బంధువుల సమక్షంలో తమ చిన్నకుమార్తె చనిపోయిందని, ఆమె చిత్రపటం ఏర్పాటు చేసి పిండం సమర్పించి విందు భోజనం పెట్టి కర్మక్రియలు చేసుకున్నారు.


