6న ఉపాధి పరిరక్షణ యాత్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉపాధి హామీ చట్టంను మహాత్మా గాంధీ పేరిట కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర 6వ తేదీన జిల్లాలో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధిహామీ పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఉదయం పలమనేరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం జీడీ నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నగర అధ్యక్షుడు టిక్కీ రాయల్ , ఎం మైనారిటీ నాయకులు అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
పంటలపై ఏనుగుల దాడి
గుడిపాల: మండలంలో పంటలపై గజదాడులు ఆగడం లేదు. మరోసారి ఇవి స్వైర విహారం చేశాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు 13 ఏనుగుల గుంపు పంటలపై పడి నష్టం కలిగించాయి. కిల్లారిపల్లె గ్రామ సమీపాన వరిపంట, పశుగ్రాసం, మామిడి పంటలను, 189 కొత్తపల్లె సమీపంలో చెరకు పంటను ధ్వంసం చేశాయి. ఆ తర్వాత పిళ్లారికుప్పం, బట్టువాళ్లూరు గ్రామాల సమీపానికి వెళ్లి అరటి పంటను ధ్వంసం చేసి అటవీప్రాంతంలోకి వెళ్లి పోయాయి. వీటి దాడుల్లో దాదాపు 20మంది రైతులు తమ పంటలు నష్టపోయారు. అటవీశాఖ అధికారులు టపాసులతో బెదిరించడం మినహా ఏనుగులను దాడుల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపడంలేదని రైతన్నలు వాపోయారు.
జోరుగా మట్టి
నమూనాల సేకరణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించే రైతుల కోసం మట్టి నమూనాలు సేకరణ జోరుగా చేస్తున్నట్టు ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శివశంకర్ తెలిపారు. జిల్లాకు 16,401 లక్ష్యంగా కాగా మూడు రోజులుగా ఈ మట్టి నమూనా లు సేకరిస్తున్నామని, ఇప్పటి వరకు 1,143 నమూనాలు సేకరించినట్లు తెలిపారు. మార్చి నెలాఖరు లోపు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. భూసార పరీ క్షల ఆధారంగా రైతులు పంటలు సాగు చేసేలా చూస్తామన్నారు.
ఓవరాల్ చాంపియన్‌గా
ఎన్‌ఎస్‌యూ
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా నాలుగు రోజులుగా జరిగిన సౌత్‌జోన్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్–2026 ఘనంగా ముగిసింది. దేశంలోని 13 వర్సిటీల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్న స్పోర్ట్స్ మీట్‌లో తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ విద్యార్థులు పలు పోటీల్లో ప్రతిభ చూపి, ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. మంగళవారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఎల్ జయరాములు ముఖ్యఅతిథి విచ్చేసి ప్రసంగించారు. సంస్కృత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే తమ తరఫున ఇంటర్నేషనల్ స్పాన్సర్షిప్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాకే వర్సిటీకి రెండు గోల్డ్ మెడళ్లు, బెస్ట్ రీసెర్చ్ గోల్డ్‌మెడల్, స్పోర్ట్స్‌లో ప్రతిభ కనబరచిన వారికి రెండు క్రీడా గోల్డ్ మెడల్స్ అందజేస్తామని చెప్పారు. వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత విద్యతో పాటు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు సౌత్‌జోన్ స్పోర్ట్స్ మీట్ గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ వి సేతురామ్, స్పోర్ట్స్ మీట్ చైర్మన్ ప్రొఫెసర్ దక్షిణమూర్తి శర్మ, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ వెంకటనారాయణ పాల్గొన్నారు.
నిరంతరాయ విద్యుత్
సరఫరానే ధ్యేయం
తిరుపతి రూరల్: వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనే ధ్యేయంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సూచించారు. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న శ్రీకరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ చంద్రశేఖరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవాశీర్వాదంతో కలిసి తిరుపతి జిల్లా నారాయణవనం మండలం బ్రాహ్మణ తాంగేళిలో పర్యటించారు. ఆ గ్రామంలో విద్యుత్ లైన్లను పరిశీలించి, సరఫరా తీరుపై వినియోగదారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రూఫ్ టాప్ సోలార్, స్మార్ట్ మీటర్ల ఉపయోగాలను వినియోగదారులకు వివరించారు. సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే స్మార్ట్ మీటర్ల అంశంపై వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలన్నారు.


