నార్వే ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ | Sridhar Babu Meets Norwegian Delegation | Sakshi
Sakshi News home page

నార్వే ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Apr 21 2026 6:08 PM | Updated on Apr 21 2026 6:52 PM

Sridhar Babu Meets Norwegian Delegation

లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయా రంగాల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేలా నార్వే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు.

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం ఆ దేశ రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ‘తెలంగాణ - నార్వే’ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించింది.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీలను, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, అవకాశాలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆఫ్‌షోర్ విండ్, క్లైమేట్ ఇన్నోవేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థలలో ‘నార్వే’ గ్లోబల్ లీడర్ గా కొనసాగుతోందని కొనియాడారు.

ఏఐ, క్లైమేట్ టెక్, హెల్త్ టెక్, డీప్ టెక్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డీ కార్బనైజేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్ హెల్త్, బయోటెక్, మెడికల్ డివైజెస్ తదితర అంశాల్లో కలిసే పని చేసేందుకు గల అవకాశాలపై ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ - నార్వే వర్కింగ్ గ్రూప్’ను ఏర్పాటు చేద్దామని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు.

‘తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేలా అడుగు ముందుకేస్తాం. వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం’ అని నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నార్వే ఇన్నోవేషన్ హెడ్ బ్యోర్న్ ఐవర్సన్, ఫస్ట్ సెక్రటరీ సిల్జే క్రిస్టీన్ ఆండర్సన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సిరి వెసెత్ మెలింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement