అనిశ్చితి సమయాల్లో ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’ | RBI Governor Malhotra Stresses Wait and Watch Policy Global Tensions | Sakshi
Sakshi News home page

అనిశ్చితి సమయాల్లో ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’

Apr 21 2026 7:22 AM | Updated on Apr 21 2026 8:32 AM

RBI Governor Malhotra Stresses Wait and Watch Policy Global Tensions

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో అంతరాయాలు వంటి అనిశ్చిత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరిస్తున్న వేచి చూసే ధోరణి అత్యంత కీలకమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇటీవల అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానంలో చురుకైన మార్పులు చేయడం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రసంగ సారాంశాన్ని తాజాగా ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో అధికారికంగా అందుబాటులో ఉంచింది.

తటస్థ వైఖరితోనే వెసులుబాటు

ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని ద్రవ్య విధాన సమీక్షల్లో ఆర్‌బీఐ తటస్థ వైఖరినే కొనసాగిస్తోంది. ఇది దేశీయ ద్రవ్యోల్బణం, వృద్ధి గమనానికి అనుగుణంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్‌కు అవసరమైన సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా విధానం పూర్తిగా డేటా ఆధారితంగా ఉంటుంది. ప్రమాదాల సమతుల్యతను మేము నిరంతరం అంచనా వేస్తున్నాం. అందుకే ప్రస్తుతానికి వేచి చూడటం అనే పంథాను ఎంచుకున్నాం’ అని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ సవాళ్లు

పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ సవాళ్లపై స్పందిస్తూ సరఫరా వ్యవస్థలో తలెత్తే అంతరాయాలు ద్రవ్యోల్బణంపై చూపే ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాలని మల్హోత్రా హెచ్చరించారు. సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగి అవి ఇతర రంగాలకు వ్యాపించి ద్రవ్యోల్బణ అంచనాలను పెంచితే అది ఆందోళన కలిగిస్తుంది. అటువంటి సమయంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన సూచించారు.

ప్రపంచ వృద్ధిలో అగ్రగామిగా భారత్

గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధిని వివరిస్తూ చైనా వంటి అగ్ర దేశాల కంటే భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచిందని మల్హోత్రా ప్రకటించారు.

  • భారత సగటు వార్షిక వృద్ధి: 6.1%

  • చైనా: 5.6%

  • ఇండోనేషియా: 4.2%

  • ప్రపంచ ఆర్థిక వృద్ధి: 3.2%

భారతదేశ వృద్ధికి అవసరమైన సులభతర పర్యావరణ వ్యవస్థను అందించడంలో రిజర్వ్ బ్యాంక్ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ స్థిరత్వమే లక్ష్యంగా ముందడుగు వేస్తామని గవర్నర్ తెలిపారు.

ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్..

Advertisement
 
Advertisement
Advertisement