ఒక్కరోజులో ఎగిసిన షేర్లు.. 100 బిలియన్‌ క్లబ్‌లోకి డెల్‌ సీఈవో

Michael Dell Joins 100 Billion Club As AI Driven Shares Surge - Sakshi

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్‌ (Dell Technologies) సీఈవో మైఖేల్ సాల్ డెల్ 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంబంధిత పరికరాలకు పెరిగిన డిమాండ్‌తో కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయం అమాంతం ఎగిసింది. దీంతో డెల్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌, చైర్మన్‌, సీఈవో అయిన మైఖేల్ డెల్ సంపద శుక్రవారం మొదటిసారిగా 100 బిలియన్‌ డాలర్ల మార్కును సాధించింది.

ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన డెల్ షేర్లు రికార్డు స్థాయికి 32 శాతం జంప్ చేసి, దాని వ్యవస్థాపకుని నెట్‌వర్త్‌ను 13.7 బిలియన్‌ డాలర్లు పెంచి 104.3 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.8.6 లక్షల కోట్లు) చేర్చాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం డెల్ ఇప్పుడు భారత్‌ చెందిన గౌతమ్ అదానీ తర్వాత 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.

మైఖేల్ డెల్ సంపదలో దాదాపు సగం తన కంప్యూటర్ల తయారీ కంపెనీ నుంచే వచ్చింది. ఆయన 40 సంవత్సరాల క్రితం ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు డెల్‌ కంపెనీకి ప్రారంభించారు. ఏఐ సంబంధిత స్టాక్‌లలో దూసుకుపోతున్న ర్యాలీ కారణంగా ఈ సంవత్సరం సంపద విపరీతంగా పెరిగిన కొంతమంది బిలియనీర్‌లలో మైఖేల్ డెల్ కూడా ఒకరు. ఆయన సంపద పెరగడానికి చిప్‌మేకర్ బ్రాడ్‌కామ్ కూడా దోహదపడింది. 2021లో వీఎంవేర్‌ని  కొనుగోలు చేసిన తర్వాత డెల్‌ అందులో వాటాను పొందారు. ఆ షేర్ల విలువ ఇప్పుడు 31 బిలియన్ల డాలర్లుకు పైగా ఉంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top