రిస్క్‌లో లక్షలాది జీమెయిల్‌ అకౌంట్లు.. డిలీట్‌ చేయనున్న గూగుల్‌!

Google Deleting Millions Of Gmail Accounts Next Month - Sakshi

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది గూగుల్‌ అకౌంట్లు రిస్క్‌లో ఉన్నాయి. తరచుగా ఉపయోగించని లక్షలాది అకౌంట్లను గూగుల్‌ వచ్చే డిసెంబర్‌లో తొలగించనుంది. ఇనాక్టివ్‌ అకౌంట్లు తొలగించే ప్రక్రియలో భాగంగా గత రెండేళ్లుగా ఉపయోగించని అకౌంట్లను గూగుల్‌ డిలీట్‌ చేయనుంది.

గూగుల్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రుత్‌క్రిచెలీ దీని గురించి గత మే నెలలోనే బ్లాగ​్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. రిస్క్‌ను తగ్గించడంలో భాగంగా రెండేళ్లకు పైగా వినియోగంలో లేని అకౌంట్లను తొలగించేలా గూగుల్‌ అకౌంట్ల ఇనాక్టివిటీ పాలసీని అప్‌డేట్‌ చేస్తున్నట్లు వివరించారు. దీని ప్రకారం.. రెండేళ్లకు పైగా ఉపయోగించని గూగుల్‌ అకౌంట్లు డిలీట్‌ కానున్నాయి. అంటే ఆయా అకౌంట్లకు సంబంధించిన జీమెయిల్‌, డాక్స్‌, డ్రైవ్‌, మీట్‌, క్యాలెండర్‌తోపాటు గూగుల్‌ ఫొటోలు కూడా డిలీట్‌ అయిపోతాయి.

అలాంటి అకౌంట్లతో ముప్పు
గూగుల​్‌ అకౌంట్ యూజర్ల తరచూ తమ అకౌంట్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం అప్పుడప్పుడు రెండంచల వెరిఫికేషన్‌ చెక​్‌ను గూగుల్‌ అనుసరిస్తూ ఉంటుంది. ఇలా ధ్రువీకరించని అకౌంట్ల ద్వారా ముప్పు ఉండే అవకాశం ఉంటుందని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే తొలగింపు వ్యక్తిగత గూగుల్‌ అకౌంట్లకు మాత్రమే వర్తించనుంది. స్కూళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది.

వెంటనే యాక్టివేట్‌ చేసుకోండి
సాధారణంగా చాలామందికి ఒకటి కంటే ఎక్కువ గూగుల్‌ అకౌంట్లు ఉంటాయి. అవసరానికి అనుగుణంగా ఇలా ఎక్కువ అకౌంట్లను క్రియేట్‌ చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత వాటి గురించి మరచిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అకౌంట్లన్నీ డిలీట్‌ కాబోతున్నాయి. అలా కాకూడదంటే వాటిని వెంటనే యాక్టివేట్‌ చేసుకోండి. ఆయా అకౌంట్లను ఉపయోగించి ఈమెయిల్‌ చేయడం, గూగుల్‌ డ్రైవ్‌ ఉపయోగించడం, యూబ్యాబ్‌ వీడియోలు చూడటం, గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడం, గూగుల్‌ సెర్చ్‌ చేయడం ద్వారా సంబంధిత అకౌంట్లను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top