పెట్రోల్‌ ధరలకు విరుగుడు.. ఫ్లెక్స్‌ ఇంజన్‌తో వస్తోన్న హోండా బైక్‌

Details About Upcoming Honda Flex Engine Bike  - Sakshi

పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వైపు జనాలు మళ్లుతున్నారు. ఈ తరుణంలో మరో ఐడియాతో వచ్చింది హోండా మోటర్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా సంస్థ.

పెట్రోలుతో పాటు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్‌ ఇంజన్‌ను ఉపయోగిస్తూ బైక్‌ను ఇండియా మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతున్నట్టు హోండా ప్రకటించింది. అంటే హోండా త్వరలోనే మార్కెట్‌లోకి తెచ్చే ఫ్లెక్స్‌ ఇంజన్‌ స్కూటర్‌ ఇటు పెట్రోలుతో పాటు అటు ఇథనాల్‌ ఇంధనంతో కూడా నడుస్తుంది. హోండా సంస్థ 2009లోనే టైటాన్‌ సీజీ ఫ్లెక్స్‌ పేరుతో ఓ బైకు విదేశీ మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. అయితే అప్పుడు పెట్రోలు ధరలు అదుపులోనే ఉండటంతో అంతగా క్లిక్‌ కాలేదు.

ఇండియాలో సాగు రంగంలో చెరుకు బాగా ఉత్పత్తి అవుతోంది. చెరుకు పంట నుంచి బై ప్రోడక్టుగా భారీ ఎత్తున ఇథనాల్‌ తయారు చేసే అవకాశం ఉంది. దీంతో ఇటు రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు పెట్రోలు నుంచి ఉపశమనం కలిగించేందుకు ఫ్లెక్స్‌ ఇంజన్లతో కూడిన వాహనాలు తయారు చేయాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ ఇప్పటికే అనేక సంస్థలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. 

ఇప్పటికే టీవీఎస్‌ సంస్థ ఫ్లెక్స్‌ ఇంజన్‌తో అపాచీ ఆర్టీఆర్‌ 200 ఎఫ్‌ఐ ఈ100 బైకును మార్కెట్‌లోకి తెచ్చింది. ఆ తర్వాత హోండా సంస్థ నుంచి మరో బైక్‌ మార్కె‍ట్‌లోకి రాబోతుంది. లీటరు పెట్రోలు ధరతో పోల్చినప్పుడు సగం ధరకే ఇథనాల్‌ లభిస్తుంది. అంతేకాక రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

చదవండి: ఫ్లెక్స్‌ ఇంధనాల’ ఇంజిన్లపై త్వరలో ఆదేశాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top