పెట్రోల్‌పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు: నితిన్‌ గడ్కరీ

Cost of Evs to Be at Par With Petrol Run Vehicles in 2 Years: Nitin Gadkari - Sakshi

సాంకేతికత, గ్రీన్‌ ఫ్యుయల్‌ రంగంలో వేగంగా వస్తోన్న మార్పులతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయని కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాబోయే రెండేళ్లలో పెట్రోల్‌తో నడిచే వాహనాల ధరల స్థాయికి ఈవీ వాహనాల ధరలు వస్తాయని నితిన్ గడ్కరీ లోక్‌సభలో ప్రస్తావించారు. 

తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ ఇంధనానికి మారవలసిన అవసరాన్ని ఆయన ఎత్తిచూపారు. హైడ్రోజన్‌ ఇంధనం త్వరలోనే వాస్తవికత అవుతుందని, కాలుష్య స్థాయిలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీలందరూ హైడ్రోజన్‌ టెక్నాలజీతో నడిచే వాహనాలను వాడాలని కోరారు. అంతేకాకుండా మురుగు నీటిని గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి తమ జిల్లాల్లో చొరవ తీసుకోవాలని తెలిపారు. దీంతో భవిష్యత్తులో  చౌకైన ఇంధన ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఉంటుందని  ఆయన చెప్పారు.

లిథియం-ఐయాన్‌ బ్యాటరీల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. జింక్‌-ఐయాన్‌, అల్యూమినియం-ఐయాన్‌, సోడియం-ఐయాన్‌ బ్యాటరీల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయని నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ఇదే జరిగితే పెట్రోల్‌పై ప్రస్తుతం రూ.100 ఖర్చు చేస్తోన్న వారు ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో రూ.10 మాత్రమే చెల్లించే రోజులు త్వరలోనే రానున్నాయని పేర్కొన్నారు. దాంతో పాటుగా ఇండియన్‌ రోడ్లపై కూడా ఆసక్తి కర వ్యాఖ్యలను చేశారు. 

భారత్‌ రోడ్లు సూపర్‌..!
అమెరికన్‌ రోడ్ల కంటే భారత్‌లోని రోడ్లు అత్యద్భుతంగా ఉన్నాయంటూ గడ్కరీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జరిగే రోడ్ల నిర్మాణంపై కూడా ప్రస్తావించారు. ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వేను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ-అమృత్ సర్ మార్గం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది అని అన్నారు. అలాగే, కొత్తగా నిర్మిస్తున్న మార్గం వల్ల ఢిల్లీ నుంచి అమృత్ సర్ చేరుకోవడానికి 4 గంటల సమయం మాత్రమే పడుతుందని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న రోడ్డుతో  శ్రీనగర్ నుంచి ముంబై చేరుకోవడానికి 20 గంటల సమయం పడుతుందని గడ్కరీ చెప్పారు.

చదవండి: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక 60 కిలోమీటర్ల వరకు నో టోల్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top