ఒక్కరూ రాలేదు!
● మున్సిపాలిటీ గుత్తలకు రెండోసారి వేలం..
● ఈనెల 24న మూడోసారి వేలం
మదనపల్లె : మదనపల్లె మున్సిపాలిటీ చెందిన గుత్తలకు నిర్వహిస్తున్న వేలం పాటల వ్యవహారం అంతా అనుకుంటున్నట్టుగానే జరుగుతోంది. పది రోజుల క్రితం కమిషనర్ ప్రమీల గుత్తలను అప్పగించేందుకు మున్సిపల్ కార్యాలయంలో వేలం పాటలను నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి ఇద్దరు మాత్రమే హాజరై పాట పాడకుండా వెళ్లిపోయారు. దీనిపై అనుమానాలు రేకెత్తడంతో కమిషనర్ రెండోసారి వేలం ప్రకటించి సోమవారం కార్యాలయంలో పాట నిర్వహణకు సిద్ధమయ్యారు. అయితే ఊహించని విధంగా మళ్లీ అధికారులకు పాటదారులు షాక్ ఇచ్చారు. వారపు సంత, దినసరి మార్కెట్, జంతువధశాల, ప్రైవేట్ బస్టాండ్ లకు రెండోసారి నిర్వహించిన వేలంపాటలకు ఒక్కరూ కూడా హాజరు కాలేదు. పాటదారుల కోసం వేచి చూసిన కమిషనర్ ప్రమీల, అధికారులు ఎవరూ రాకపోవడంతో ఈనెల 24న మూడోసారి వేలం నిర్వహించేందుకు నిర్ణయించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి వారపుసంతకు రూ.45 లక్షలు, దినసరి మార్కెట్ కు రూ.1.20 కోట్లుగా ప్రభుత్వ ధర నిర్ణయించారు. దీంతో వేలం పాటల నిర్వహణ చేపట్టారు. మొదటిసారి జరిపిన వేలంపాటలో ఇద్దరే పాల్గొన్నారు. దీంతో కమిషనర్ ప్రమీల వాయిదా వేశారు. సాధారణంగా ప్రభుత్వ ధర నిర్ణయించిన పాట నుంచే వేలంపాట మొదలై అంతకుమించి పాట పాడిన వారికి ఏడాది పాటు రుసుం వసూళ్లకు గుత్త అప్పగిస్తారు. అయితే మదనపల్లె మున్సిపాలిటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితి చర్చనీయాంశమైంది. గతంలో పాటదారులు గుత్త దక్కించుకునేందుకు పోటీపడేవాళ్లు. మున్సిపాలిటీకి మంచి ఆదాయం లభించేది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితి చూస్తుంటే పాటదారులు ఎందుకు ముందుకు రావడం లేదు, దీనికి అసలు కారణమేమిటి అన్నది అంతు చిక్కడం లేదు. అయితే సిండికేట్ గా వ్యవహరించి తాము చెప్పిన ధరకే గుత్తలు ఇవ్వాలన్న ఒత్తిడి అధికారులపై తీసుకువచ్చేందుకే ఇలా చేస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారులు ఎలా వ్యవహరిస్తారు అన్నది సవాల్ గా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న గుత్తల అప్పగింత వ్యవహారంలో జరిగిన పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైనే ఉంది.


