మెడికల్ మాఫియాపై ఉద్యమిస్తాం
మదనపల్లె అర్బన్ : మెడికల్ మాఫియాపై ఉద్యమ పోరాటం తప్పదంటూ సీపీఐ నాయకులు పేర్కొన్నారు.
శనివారం స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రి ఎదుట ఫార్మా, మెడికల్ మాఫియాపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్పలు మాట్లాడుతూ మెడికల్ మాఫియా చాపకిందనీరులా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. ముఖ్యంగా బోగస్, నాణ్యతలేని మందులతో ప్రాణనష్టం సంభవిస్తోందన్నారు. ప్రజల ప్రాణాలతో వైద్యశాఖ చెలగాటమాడుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలు, కార్పొరేట్ ఆస్పత్రుల అధిక లాభాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నట్లు ఆరోపించారు. ఇందులోభాగంగా నాణ్యతలేని మందులు, వైద్యసామగ్రి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల దందాపై గతంలో కూడా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అయితే చిన్నపాటి జబ్బులకు రూ.లక్షల్లో బిల్లులు వేసి ప్రాణాలు తోడేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఫార్మా, మెడికల్ మాఫియాతో ఆర్థికంగా నష్టపోయి, ప్రాణాలు కోల్పోతున్నా.. వైద్యారోగ్యశాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మాఫియాకు కళ్లెం వేయకుంటే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామంటూ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివ, మురళీ, చిన్నయ్య, శ్రీనివాసులు, వెంకటేష్, మాధవ్, చంద్రశేఖర్, రవి, చిన్నప్ప, తిరుమల, దేవా, తదితరులు పాల్గొన్నారు.


