నెలాఖరులోపు ఘాట్‌రోడ్డు మరమ్మతులు పూర్తి 

YV Subba Reddy Comments On Tirumala Ghat road repairs - Sakshi

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

తిరుమల: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్‌ రోడ్డు మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని, వైకుంఠ ఏకాదశిలోపు పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు అనుమతించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చీఫ్‌ ఇంజనీర్‌ను ఆదేశించారు. మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలను చైర్మన్‌ గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షానికి పెద్ద బండరాళ్లు పడినా స్వామివారి దయవల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. పడిన బండరాళ్లను పూర్తిస్థాయిలో తొలగించామని, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఘాట్‌ రోడ్డులో 7, 8, 9, 14, 15 కిలోమీటర్ల వద్ద త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించామన్నారు.

ఐఐటీ నిపుణుల సహకారంతో ఘాట్‌ రోడ్డులో బండరాళ్లు పడే ఇతర ప్రాంతాలను సైతం గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పనులన్నింటినీ ఈ నెలాఖరుకు పూర్తి చేసి రెండో ఘాట్‌ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చైర్మన్‌ వెంట టీటీడీ చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు, ఎస్‌ఈ–2 జగదీశ్వర్‌రెడ్డి, వీజీవో బాలిరెడ్డి, ఈఈ సురేంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ రమణ 
తదితరులు ఉన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top