10 నుంచి తిరుమల రెండో ఘాట్‌ రోడ్డు సిద్ధం | Sakshi
Sakshi News home page

10 నుంచి తిరుమల రెండో ఘాట్‌ రోడ్డు సిద్ధం

Published Tue, Jan 4 2022 5:09 AM

Tirumala Second Ghat Road ready for 10th January - Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత నెలలో పెనుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న తిరుమల ఎగువ(రెండో) ఘాట్‌ రోడ్డు పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పదో తేదీకల్లా ఘాట్‌ రోడ్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు టీటీడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గడిచిన 30 ఏళ్లలో తిరుమలలో ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్‌ ఒకటో తేదీ తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద పెట్టున కొండ చరియలు విరిగిపడి నాలుగు చోట్ల ఎగువ ఘాట్‌ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం ఆ రోడ్డులో రాకపోకలను నిలిపేసి యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. లింక్‌ రోడ్డును తెరచి తిరుమలకు వెళ్లే వాహనాలను ఆ రోడ్డు మీదుగా మళ్లించింది. మరోవైపు నిరంతరాయంగా పునర్నిర్మాణ పనులను చేపట్టింది. 12, 14, 15, 16 కి.మీ. వద్ద దెబ్బతిన్న ఘాట్‌ రోడ్డు పునర్నిర్మాణ పనులను తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్‌లై ఓవర్‌ నిర్మిస్తున్న ఆఫ్కాన్‌ సంస్థకు అప్పగించారు. ఇప్పటికే ఆ సంస్థ సైడ్‌ వాల్స్‌ నిర్మాణాలను పూర్తి చేసింది. కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్న చోట రాక్‌ బోల్ట్‌ టెక్నాలజీతో చేపట్టిన మెష్‌ల నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. ఈ నెల 10న రెండో ఘాట్‌ రోడ్డును తిరిగి వినియోగంలో తెస్తామని టీటీడీ ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం ‘సాక్షి’తో చెప్పారు.

Advertisement
Advertisement