CDMA: పట్టణాల్లో ఫిర్యాదులపై ప్రత్యేక వ్యవస్థ!

Special System For Complaints In Towns of Andhra Pradesh - Sakshi

మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పెండింగ్‌ సమస్యలకు వెంటనే పరిష్కారం

మొత్తం 4,136 వార్డుల్లోనూ జవాబుదారీతనం పెంచేలా చర్యలు

ఫిర్యాదుల స్వీకరణకు సీడీఎంఏలో కంప్లైంట్‌ సెల్‌ ఏర్పాటు

ప్రతి నెలా మూడు మునిసిపాలిటీల్లో సీడీఎంఏ పర్యటన

సమస్యల పరిష్కారంలో మునిసిపల్‌ కమిషనర్లదే బాధ్యత

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ప్రజలకు సకాలంలో సేవలు అందించడంపై రాష్ట్ర మునిసిపల్‌ పాలనా విభాగం దృష్టి సారించింది. ఏ స్థాయిలోనూ ‘పెండింగ్‌’ అనేది లేకుండా నిబంధనల ప్రకారం వెంటనే సమస్యలను పరిష్కరించనుంది. ఈ మేరకు మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ) ప్రవీణ్‌ కుమార్‌ మునిసిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 123 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందించాల్సిన సేవలపై పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి మంగళ లేదా బుధవారాల్లో మునిసిపల్‌ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. అలాగే ప్రతినెలా మూడు లేదా నాలుగు మున్సిపాలిటీల్లో సీడీఎంఏ స్వయంగా పర్యటించనున్నారు. 
 
ఏ లోపం ఉన్నా కమిషనర్లదే బాధ్యత 
ప్రభుత్వ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయా? లేదా అనే అంశంపై మునిసిపల్‌ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో సిబ్బంది, కమిషనర్లపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఒక బృందాన్ని కూడా నియమిస్తోంది. మునిసిపాలిటీలో ఏ స్థాయిలో అవినీతి జరిగినా, ప్రజలకు అందించాల్సిన సేవల్లో లోపం కనిపించినా అందుకు స్థానిక కమిషనర్లనే బాధ్యులను చేయనుంది. 

4,136 వార్డులపై ప్రత్యేక దృష్టి 
వార్డు సచివాలయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని మునిసిపల్‌ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అన్ని మునిసిపాలిటీల్లో ఉన్న 4,136 వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి ఎప్పుడు ఏం ప్రశ్న వస్తుందోనని మునిసిపల్‌ కమిషనర్లు జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తుల దుమ్ముదులిపే పనిలో నిమగ్నమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి మునిసిపాలిటీలో ఇటీవల పర్యటించిన సీడీఎంఏ ప్రవీణ్‌ కుమార్‌ కొత్తపేట–2 సచివాలయంలో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారు యూనిఫామ్‌ ధరించకపోవడాన్ని గుర్తించారు.

వార్డు కార్యాలయాల్లో సిబ్బంది పేర్లు, వారు అందించే సేవల బోర్డులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో సిబ్బంది పనితీరుని మునిసిపల్‌ కమిషనర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ పర్యటనలో ఆయన గుర్తించిన లోపాలను అన్ని మునిసిపాలిటీలు సరిచేసుకోవాలని 123 మంది కమిషనర్లకు నోటీసులు పంపించారు.  

కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే.. 
పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో సకాలంలో సేవలు అందలేదని ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. కిందిస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలి. కమిషనర్లు పట్టణంలో పర్యటిస్తుంటే సమస్యలు తెలుస్తాయి.  ఫిర్యాదులు, పెండింగ్‌ సమస్యలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలి. మునిసిపాలిటీల్లో 4,136 వార్డులు ఉన్నాయి. వాటిలో 317 సేవలు అందించాలి. ఎవరు ఎలాంటి సేవలు అందిస్తారనేది వార్డు సచివాలయాల్లో బోర్డులు పెట్టాలి. కొన్ని వార్డుల్లో ఇప్పటిదాకా బోర్డులు పెట్టనిచోట చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చేలా ప్రవర్తించినా, ప్రభుత్వ సేవలు, పథకాలు సకాలంలో ప్రజలకు అందకున్నా బాధ్యులపై చర్యలు తప్పవు.  

– ప్రవీణ్‌ కుమార్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top