ఐ డ్రాప్స్‌ శాంపిల్స్‌ను పరీక్షకు పంపండి: హైకోర్టు

High Court Mandate to Andhra Pradesh Govt on Anandaiah Medicine - Sakshi

ఆనందయ్య మందుపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గరిష్టంగా రెండు వారాల్లో నివేదిక ఇచ్చేలా చూడండి

‘కె’ రకం మందు పంపిణీకి ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దు

తదుపరి విచారణ 21కి వాయిదా

సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన బొణిగె ఆనందయ్య తయారుచేసిన ఐ డ్రాప్స్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను క్రిమిరహిత (స్టెరిలిటీ) పరీక్షకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా.. గరిష్టంగా రెండు వారాల్లో ఆ పరీక్ష నివేదిక ఇచ్చేటట్లు చూడాలని స్పష్టం చేసింది. ఆనందయ్య తయారు చేసిన మందుల్లో ఒకటైన ‘కె’ రకం మందు.. వినియోగానికి యోగ్యమైనదేనని నిపుణుల కమిటీ తేల్చిన నేపథ్యంలో ఆ మందు పంపిణీ విషయంలో ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దంది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా చికిత్స నిమిత్తం తాను తయారు చేసిన మందు పంపిణీని అడ్డుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆనందయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో మరో రెండు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై కొద్ది రోజులుగా హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. ధర్మాసనం ఆదేశాల మేరకు ఆనందయ్య మందు విషయంలో నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. కంటిలో వేసే ఐ డ్రాప్స్‌ మినహా మిగిలిన మందుల పంపిణీకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఐ డ్రాప్స్‌ విషయంలో నిపుణుల కమిటీ అభ్యంతరాలు తెలిపిందని, అందువల్ల తుది పరీక్షల అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top