AP: గ్రామీణ క్రీడల్లో నవశకం..

Establishment Of YSR Sports Clubs In AP - Sakshi

వైఎస్‌ఆర్‌ క్రీడాక్లబ్‌ల ఏర్పాటు

ఔత్సాహికులైన పెద్దలకూ అవకాశం

రిజిస్టేషన్లకు 31 వరకూ గడువు

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): జిల్లా క్రీడాభివృద్ధిలో వైఎస్‌ఆర్‌ క్రీడాక్లబ్‌ల పాత్ర కీలకం కానుంది. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ క్రీడాక్లబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వివిధ పర్వదినాలు, ఉత్సవాల సమయంలో పోటీలు నిర్వహించాలని తలపెట్టింది. పెద్ద వయస్సు వారిని వాకింగ్, సైక్లింగ్‌ తదితర అంశాల్లో ప్రోత్సహించాలని సంకల్పించింది. దీనిపై క్రీడాప్రాధికార సంస్థ(డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను కలెక్టర్‌ కృతికాశుక్లా ఇటీవల ఆవిష్కరించారు. ఈ యాప్‌లో ఈ నెల 31 వరకూ క్లబ్‌ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. జిల్లాలో 21 మండలాల్లోని 335 గ్రామ పంచాయతీల్లో  క్లబ్‌ల ఏర్పాటుకు డీఎస్‌ఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

బాధ్యతలు అప్పగింత
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో సచివాలయ అడ్మిన్‌ కార్యదర్శులకు క్లబ్‌ల బాధ్యత అప్పగించారు. వయో వృద్ధుల కోసం జగనన్న వాకింగ్‌ క్లబ్‌లు ఏర్పాటు చేస్తారు. మహిళలకు స్కిప్పింగ్, టెన్నికాయిట్, త్రో బాల్‌ తదితర పోటీలు నిర్వహిస్తారు. సామాజిక భవనాలు, పంచాయతీ హాళ్లలో వసతులు గుర్తించి చెస్, క్యారమ్స్, ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ అడ్మిన్‌ కార్యదర్శి ప్రతీనెలా స్పోర్ట్స్‌ క్లబ్‌ సమావేశం నిర్వహిస్తారు. కబడ్డీ, వాలీబాల్, రబ్బర్‌బాల్‌తో క్రికెట్‌ వంటి అనువైన క్రీడలు ఆడిస్తారు. ఎన్నారైలు, దాతలు, వ్యాపారులు, ఉద్యోగుల నుంచి క్రీడాపరికరాలు సమకూర్చుకుంటారు.

 

ఆరోగ్యానికి బాట
క్రీడలు, వ్యాయామం, వినోద కార్యక్రమాల్లో అందరూ పాల్గొనేలా అవగాహన కల్పించి, తద్వారా ఆరోగ్యాన్ని  మెరుగుపర్చడం స్పోర్ట్స్‌ క్లబ్‌ల లక్ష్యం. క్లబ్‌ల రిజి్రస్టేషన్‌ ఈ నెల 31 లోపు పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదివారం ఆదేశాలు అందాయి.

శ్రీనివాస్‌ కుమార్, చీఫ్‌ కోచ్, డీఎస్‌ఏ, కాకినాడ
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top