లక్ష్యం.. వాస్తవ ప్రగతి | CM Jagan high level review on achievement of Development Goals | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. వాస్తవ ప్రగతి

Published Tue, Nov 1 2022 2:29 AM | Last Updated on Tue, Nov 1 2022 2:29 AM

CM Jagan high level review on achievement of Development Goals - Sakshi

ప్రగతి అనేది వాస్తవ రూపంలో ఉండాలి.. అందమైన అంకెల రూపంలో చూపడం కాదు. ప్రతి అంశంలోనూ సాధించాల్సిన ప్రగతిపై క్షేత్ర స్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేపట్టాలి. వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో, లక్ష్య సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుంది. ఎస్‌డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, తాగునీటిపై శ్రద్ధ చూపాలి.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది పనితీరును మండలాల వారీగా ఆయా విభాగాలకు చెందిన అధికారులు పర్యవేక్షించేలా ఎస్‌వోపీలను రూపొందించాలని సూచించారు. మండల స్థాయిలో అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వాధికారులు నెలకు రెండుసార్లు ఆయా సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తూ సిబ్బంది సమర్థత పెంచాలని నిర్దేశించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ప్రగతి ఎప్పటికప్పుడు నమోదు 
గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తెచ్చింది. అలాంటి సచివాలయాలపై నిరంతర పర్యవేక్షణ, ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం చాలా కీలకం. లేదంటే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుంది. 

నిశిత దృష్టి, జవాబుదారీతనం..
ఆధార్‌ కార్డు నంబరు, వివరాలతో సహా డేటాను నిక్షిప్తం చేయడంతోపాటు వచ్చిన మార్పులు చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలి. ఏమైనా సమస్యలుంటే సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలి. ఉదాహరణకు రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి.

వారికి సరైన ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. తద్వారా ఆ సమస్య ఇక పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలి. సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. వివిధ ప్రభుత్వ విభాగాల తరపున గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు సచివాలయాలను చోదక శక్తిలా వినియోగించుకునేలా సిబ్బందిని çపూర్తి స్ధాయిలో భాగస్వాములుగా చేయాలి. సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్‌వోపీలను మరోసారి పరిశీలించి అవసరమైతే మార్పుచేర్పులు చేయాలి. 

సమర్థత పెంచేలా సచివాలయాల సందర్శన..
మండల స్థాయిలో ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన అధిపతి ప్రతి నెలా రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తూ సమర్థత పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సిబ్బంది ఎఫిషియన్సీ పెంపొందించేలా చూడాలి. ఆయా శాఖలకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారు? ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఎలా కృషి చేస్తున్నారో పరిశీలన చేయాలి.

ప్రతి విభాగంలోనూ పర్యవేక్షణ ఉండాలి. ఏ విభాగంలోనైనా సంబంధిత అధికారి లేకుంటే ఆయా విభాగాలకు మండలాలవారీగా వెంటనే నియమించాలి. వీలైనంత త్వరగా దీన్ని చేపట్టాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందికి సరైన మార్గ దర్శకత్వం లభిస్తుంది. అవగాహన కలుగుతుంది. ఎప్పటికప్పుడు వివరాల నమోదు సమగ్రంగా జరుగుతుందో లేదో  పర్యవేక్షణ ఉంటుంది. లక్ష్యాల సాధన దిశలో మనం ఎక్కడున్నామో తెలుస్తుంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

కలెక్టర్లు, జేసీలు పరిశీలన చేయాలి
గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతోంది? అనే విషయంపై జేసీలు, కలెక్టర్లు పరిశీలన చేయాలి. సచివాలయాలను తమవిగా భావించాలి. ప్రతి స్థాయిలోనూ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకు పడతాయి. దేశంలో మన రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలుస్తుంది. 

ప్రతి నెలా వివరాలు నమోదు
వ్యవసాయం, విద్య, మహిళ, శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాలపై మనం ఖర్చు చేస్తున్నట్లు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయడం లేదు. వీటిపై సమగ్ర పర్యవేక్షణ అవసరం. ప్రగతి లక్ష్యాల సాధనపై నెల రోజులకు ఒకసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి సాంకేతికతను వాడుకోవాలి.

డ్రాపౌట్స్‌ ఉండకూడదు
పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూడదు. డ్రాపౌట్స్‌ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు. సచివాలయాల వారీగా, వలంటీర్ల వారీగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాపౌట్‌ గురించి సమాచారం అందితే అధికారులు వెంటనే స్పందించాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరు పరిశీలించాలి. ఎవరైనా వరుసగా మూడు రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరా తీయాలి. పిల్లలు బడికి రాకపోతే తప్పనిసరిగా ఎస్‌ఎంఎస్‌ పంపాలి. ఇవన్నీ కచ్చితంగా జరిగాలి.

కళ్యాణమస్తుతో.. 
కళ్యాణమస్తు పథకం ద్వారా లబ్ధి పొందేందుకు నిర్దేశించిన అర్హతలు బాల్య వివాహాల నివారణ, అక్షరాస్యత పెరిగేలా దోహదం చేస్తాయి. వధూవరుల కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించాం. పెళ్లి కుమార్తె కనీస వయసు 18 ఏళ్లు, పెళ్లి కుమారుడి కనీస వయస్సు 21 ఏళ్లుగా నిర్దేశించినందున ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు.

రానున్న రోజుల్లో మంచి ఫలితాలు
విద్య సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయి. ఇంగ్లీషు మీడియం సహా పలు సంస్కరణల ద్వారా పరిస్థితులను సమూలంగా మార్చేసే మహా యజ్ఞాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు ఉజ్వల భవిష్యత్తు కలిగిన తరాలుగా సమాజానికి అందుతాయి. 

చదువుల యజ్ఞం కొనసాగుతుంది..
ఇంగ్లీషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలే ఇంగ్లీషు మీడియంలో చదవాలి, పేద బిడ్డలు మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదవకూడదనే వైఖరిని పదేపదే చాటుకుంటున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు అందకూడదన్నదే వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. తద్వారా చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది.

సమీక్షలో సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, ప్లానింగ్‌ సెక్రటరీ విజయ్‌కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌ కాటమనేని భాస్కర్,  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జె.నివాస్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి.సంపత్‌ కుమార్, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement