పాముకాటుతో రైతు మృతి
పుట్టపర్తి టౌన్: పాముకాటుతో యవ రైతు మురళీ (35) మృతి చెందిన సంఘటన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధి రాయలవారిపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయలవారిపల్లికి చెందిన రామప్ప, చిన్నాగమ్మ దంపతుల కుమారుడు మురళీ తన పొలంలో దోస పంట సాగు చేశారు. ఆదివారం ఉదయం తన భార్యతో కలసి తన పొలంలో వేసిన దోస పంటకు మందుల పిచికారీకి వెళ్లాడు. పని ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసిన అనంతరం వాంతులు, వీరేచనాలు కావడంలో కుటుంబ సభ్యులు వెంటనే సత్యసాయి సూపర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యం చేస్తుండగానే మృతి చెందారు. పాము కాటుతో మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.


