అపు‘రూపం’... పాదరస శివలింగం
● నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు
రాయదుర్గంటౌన్: శివలింగం అంటే తెలియని వారు, చూడని వారు ఉండరు. అయితే పాదరస శివలింగాన్ని చూశారా అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే పాదరసాన్ని ఘనరూపంలో చూడలేం కాబట్టి!. అయితే ఇలాంటి అపు‘రూప’మైన శింగలింగాన్ని రాయదుర్గం పట్టణంలోని శ్రీరాజ విద్యాశ్రమంలో చూడవచ్చు. దేశంలోనే ప్రథమంగా 1974లో అప్పటి ఆశ్రమ పీఠాధిపతి జీవన్ముక్తస్వాములు, జడసిద్దేశ్వర సరస్వతీ స్వాముల వారు రాయదుర్గంలో పాదరస శివలింగాన్ని ప్రతిష్టించారు. జీవన్ముక్తస్వామి రసవాదుల్ని పిలిపించి రెండు నెలలు అహర్నిశలు కృషి చేసి రుద్రమంత్ర జపాలతో ఏడు కిలోల పాదరసాన్ని మూలికాదులతో ఘనీభవింప చేసి లింగాకృతినిచ్చారు. ఈ శివలింగం 14 సెంటీమీటర్ల ఎత్తు, 25 సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. పాణిపటాన్ని మాత్రం నల్లరాతితో కర్ణాటకలోని రాణిబెన్నూరులో తయారు చేయించి ప్రతిష్టించారు. ఆదివారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహా శివరాత్రి రోజు శివలింగాన్ని తాకే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తారు.
నీళ్లడిగి.. నిలువునా దోచి
● గుంతకల్లులో కి‘లేడీల’ బ్యాచ్ హల్‌చల్
గుంతకల్లుటౌన్: పట్టణంలో కిలాడీ మహిళల బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఓ మహిళ ఇంటికి వెళ్లి నీళ్లు అడిగి.. ఆమెను మాటల్లో దించి నగలు, నగదుతో ఉడాయించింది. వివరాల్లోకెళితే... హౌసింగ్‌బోర్డు నాగసముద్రం బావి వీధికి చెందిన సరస్వతి రోజుమాదిరిగానే శనివారం ఉదయం ఆకుకూరలు అమ్ముకుని ఇంటికి చేరుకుంది. కొద్ది సేపటి తర్వాత ఆరుగురు మహిళలు ఆమె ఇంటికి వచ్చి తాగడానికి నీళ్లు కావాలని హిందీలో అడిగారు. నీరు తాగేందుకు గ్లాసులు ఇవ్వగా అందుకు వారు నిరాకరించి.. దోసిట్లో పోయాలని కోరారు. సరే అని నీరు పోస్తుండగా వారంతా చుట్టూ చేరి ఆమెతో మాటలు కలిపారు. ఆరుగురిలో ఒక మహిళ ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు తెరిచి.. అందులో భద్రపరిచిన ఆరు గ్రాముల బంగారు కమ్మలు, 30 తులాల వెండి, రూ.5 వేల నగదుతో ఉడాయించింది. ఆ తర్వాత మిగిలిన ఐదుగురు మహిళలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఇంట్లోకి వెళ్లి సరస్వతి చూడగా బీరువాలు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని, భర్త అంజికి సమాచారమిచ్చింది. నిందితులు మిల్లు ఏరియా మీదుగా వెళ్లినట్లు సమాచారం రావడంతో ఆ వైపు గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా ఆరుగురు ముఠా సభ్యులు మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతానికి చెందిన వారని సమాచారం.


