మెడికల్ మాఫియాను అరికట్టాలి
● నేడు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిరసనలు
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్
గుంతకల్లు: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాకు అడ్డుకట్టు వేయాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీపీపీ విధానంతో వైద్యాన్ని మరింత ఖరీదుగా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజల జీవించే హక్కుపై మెడికల్ మాఫియా పరోక్షంగా దాడి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. నాణ్యత లేని, కల్తీ మందులు విచ్చలవిడిగా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెళితే... లేనిపోని పరీక్షలు, మందులు రాసి రూ.వేలల్లో బిల్లులు చేస్తున్నారని ఆరోపించారు. తీరా రోగాన్ని నయం చేయలేక రెఫరల్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు పంపి కమీషన్లు దండుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేయాలని, కార్పొరేట్ ఆస్పత్రుల దందాపై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల ఎదుట తలపెట్టిన నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎం.వీరభద్రస్వామి, బి.మహేష్, ఈశ్వరయ్య, దాసరి శ్రీనివాసులు, వెంకట్‌నాయక్ పాల్గొన్నారు.


