చికిత్స పొందుతూ యువకుడి మృతి
బ్రహ్మసముద్రం : మండలంలోని పడమటి కోడిపల్లి గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన జి.వీరేష్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం మృతి చెందాడు. వారం క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఆయన ఆస్పత్రి పాలయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. కోమాలో ఉన్న వీరేష్ పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
కసాపురంలో ప్రశాంతంగా టెండర్లు
● తలనీలాల సేకరణకు రూ.1.36 కోట్లు
గుంతకల్లు: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదాయ వనరులపై బుధవారం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఆలయ ఈఓ ఎం.విజయరాజు, ధర్మకర్త కె.సుగుణమ్మ నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలంతో పాటు ఈ–టెండర్లలో పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. గత ఏడాది రూ.1,02,6000 తలనీలాల సేకరణ హక్కుకు టెండర్ పాడగా... ఈ ఏడాది అనంతపురానికి చెందిన కాంట్రాక్టర్ నవీన్ ఏకంగా రూ.1,36,50,000కు పాడి వేలం దక్కించుకున్నాడు. టోల్‌గేట్ నిర్వహణకు గత ఏడాది రూ.7.10 లక్షలు కాగా, ఈ ఏడాది రూ.19,07,069కు, సెల్‌ఫోన్లు భద్రపరుచు హక్కు కోసం గత ఏడాది రూ.6.20 లక్షలు ఉండగా ఈ ఏడాది రూ.8.15 లక్షలకు, హుండీ ద్వారా వచ్చిన బియ్యం సేకరణ హక్కుకు గత ఏడాది రూ.12.75 లక్షలు కాగా, ఈ ఏడాది కిలోపై రూ.29 అధికంగా పాడినట్లు అధికారులు వివరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఐస్ క్రీమ్ విక్రయ హక్కు రూ.2.16 లక్షలు, అగర బత్తి తయారీకి రూ.6.11 లక్షలు, కేసరి సదనం వద్ద తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసుకుని క్యాంటీన్ నిర్వహణకు రూ.69వేలు, గోశాలలో ఎరువు సేకరణకు రూ.57 వేలు, ఒక్కో ఖాళీ డబ్బా సేకరణకు రూ.19 చొప్పన వేలం పాట సాగిందన్నారు. కాగా, ఏడాది పాటు కసాపురం ఆలయంలో కొబ్బరి కాయలు, తమలపాకులు, పూలు, పూలమాలలు, కండువాలు, శాలువాలు, జాకెట్లు, కొర పంచలు, రక్షా కంకణాలు సరఫరాకు గురువారం టెండర్లు నిర్వహించనున్నారు. అలాగే ప్రసాదాల కవర్లు, స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్లు, డెటాయిల్, స్టేషనరీ, రసీదు పుస్తకాలు వగైరా ముద్రించి ఇవ్వడం, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్ , శానిటేషన్ మెటిరియల్ సరఫరాకూ టెండర్లు ఉంటాయి. కార్యక్రమంలో ఏఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
18 నుంచి టీసీసీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకూ అనంతపురంలోని మూడు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ జి.వెంకటేష్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు www.bse.ap. gov. in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని తప్పకుండా ఽధ్రువీకరించుకోవాలన్నారు. హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ధ్రువీకరణ కార్డును వెంట తీసుకెళ్లాలని సూచించారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి


