ఉద్యాన శాఖ కార్యాలయ తలుపులు ధ్వంసం
ఉరవకొండ: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనే ఉన్న ఉరవకొండ నియోజకవర్గ ఉద్యాన శాఖ కార్యాలయ తలుపులను మంగళవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది గమనించి ఆ శాఖ అధికారి యామినికి తెలపడంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే కార్యాలయంలో రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి చెక్కుచెదరలేదని పోలీసులు గుర్తించారు. ఇది ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు.
గ్రామాల్లో తాగునీటి
సమస్య తలెత్తనివ్వకండి
● జెడ్పీ సీఈఓ శివశంకర్
ఆత్మకూరు: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడేగానీ తాగునీటి సమస్య తలెత్తరాదని, ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆదేశించారు. ఆత్మకూరు మండలం సిద్దరాంపురం, ఆత్మకూరు, సింగంపల్లి గ్రామాల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్యతో కలసి బుధవారం ఆయన పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో ఆరా తీశారు. ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలతో సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సర్వేల ప్రగతిపై ఉద్యోగులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనరసింహ, డిప్యూటీ ఎంపీడీఓ సాదిక్‌వలి, పంచాయతీ కార్యదర్శులు మల్లేష్, అశోక్, శిరీష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కేసుల దర్యాప్తులో వేగం పెరగాలి : ఎస్పీ
అనంతపురం సెంట్రల్: తీవ్రమైన నేరాల దర్యాప్తులో వేగం మరింత పెరగాలని సిబ్బందిని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించిన నెల వారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులు, హత్యలు, పోక్సో, అత్యాచారం, దొంగతనాలు, దోపిడీలు, మిస్సింగ్, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. గంజాయి తదితర మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా కలిగే దుష్ప్రభావాలు, శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మార్చిలో జరగనున్న లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్, ట్రైనీ ఐపీఎస్ అశ్వని మణిదీప్, డీఎస్పీలు శ్రీనివాసరావు, రవిబాబు, శ్రీనివాస్, మహబూబ్‌బాషా, సూర్యనారాయణరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఉద్యాన శాఖ కార్యాలయ తలుపులు ధ్వంసం


