పేట్రేగిపోతున్న టీడీపీ నాయకులు
● రస్తా లేదంటూ దౌర్జన్యం
● వత్తాసు పలుకుతున్న పోలీసులు
విడపనకల్లు: మండలంలోని వి.కొత్తకోటలో టీడీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతోందని, వారు పేట్రేగి పోతుండడంతో తమకు రక్షణ లేకుండా పోతోందని ఆ గ్రామానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఫర్వీన్, రుబియా, షేక్ బాబూన్నీ, ఖాజీము, బడేషావలి తదితరులు మాట్లాడుతూ... గ్రామంలోని బడేషావలి దర్గా సమీపంలో సర్వే నంబర్ 703లో తమకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 4 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయన్నారు. రూ. కోట్లు విలువ చేసే ఈ ఆస్తిని ఆక్రమించుకునేందుకు సిద్ధమైన స్థానిక టీడీపీ నేతలు కొందరు తమను భూమిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. బరితెగించి ఆడవాళ్లని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారని వాపోయారు. బుధవారం వారి దౌర్జన్యాలను తాళలేక డయల్ 100కి కాల్ చేసి సమస్య తెలిపినా ఎలాంటి చేకూరలేదన్నారు. చివరకు విడపనకల్లు పీఎస్‌కు వెళ్లి తమపై అసభ్యంగా మాట్లాడికి దాడికి ప్రయత్నించిన అసుండ షెక్షావలి, హోతూరు వలి, నేమకల్లు బాషు, మహమ్మద్, చాంద్, రజాక్‌వలిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నా ఫిర్యాదు స్వీకరించలేదన్నారు. చివరకు ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళతామనడంతో ఫిర్యాదు తీసుకుని, విచారణ చేస్తామని పేర్కొన్నారని వివరించారు. టీడీపీ నేతల దౌర్జన్యం నుంచి తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా బాధితులు కోరుతున్నారు.
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
రాప్తాడు రూరల్: విద్యుత్ షాక్‌కు గురై ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన జయచంద్రారెడ్డి (64) అనంతపురంలోని రాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అనంతపురం రూరల్ మండలం సజ్జలకాలువలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో విద్యుద్దీకరణ పనుల్లో పాల్గొన్న ఆయన ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. భార్య నాగేశ్వరి బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


