ముగిసిన పోలీసు క్రీడా పోటీలు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ బుధవారంతో ముగిసింది. మూడు రోజులుగా వివిధ క్రీడల్లో రాణించిన పోలీసులను అభినందిస్తూ స్థానిక పరేడ్ మైదానంలో ముగింపు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, మెమొంటోలను డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ జగదీష్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో అన్ని జట్లూ ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. కార్యక్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి, ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్వనిమణిదీప్, ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, రవిబాబు, శ్రీనివాస్, మహబూబ్‌బాషా, నీలకంఠేశ్వరరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.


