బాలికల పాఠశాలలో సమస్యలు
● పరిష్కరించాలని టీచర్ల వినతి
గుమ్మఘట్ట: మౌలిక సదుపాయాలు లేక విద్యార్థినులు పడుతున్న బాధను చూసి ఉపాధ్యాయినులు చలించిపోయారు. వారి గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు వారే ముందుకు కదిలారు. రాయదుర్గంలోని జెడ్పీ ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో 1,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంతమందికి గాను మరుగుదొడ్లు, మూత్ర శాలలు అరకొరగా ఉన్నాయి. దీంతో విద్యార్థినులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలూ లేకపోలేదు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు జయప్రద, ఉపాధ్యాయినులు అంజలి, ప్రభావతి, హేమలత సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. బాలికల ఉన్నతపాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీడీఓ కొండన్న హామీ ఇచ్చారు.


