రైతును నష్టపరిచిన నకిలీ విత్తనం
కనగానపల్లి: వ్యాపారుల మాటలు నమ్మి, వారు అంటగట్టిన నకిలీ విత్తనాలతో పంట సాగు చేపట్టి కనగానపల్లి మండలం ముత్తువకుంట గ్రామానికి చెందిన రైతు ఎం.నారాయణ మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. రైతు నారాయణ అనంతపురంలోని వినాయక ట్రేడర్స్ నిర్వాహకుడి మాటలు నమ్మి రూ.35 వేలు చెల్లించి పీహెచ్‌ఎస్– ప్లస్ అనే కళింగర విత్తనాలు కొనుగోలు చేసి, తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. తర్వాత వివిధ దశల్లో రూ.4 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాడు. నీరు సమృద్ధిగా అందిచడంతో పంట వేపుగా పెరిగి 90 రోజుల్లోనే కోతకు వచ్చింది. అయితే కాయ కోసి చూస్తే తెల్లగా బెండు బారిపోయి కనిపించింది. కాయలో నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు పంట కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని విత్తనం విక్రయించిన వ్యాపారితో పాటు విత్తన తయారీ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళితే వారి నుంచి నిరాదరణ గురైందని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. దీంతో 13 టన్నుల దిగుబడి పొలంలోనే ఉండిపోయిందని, రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. అధికారులు స్పందించి నకిలీ విత్తనం అంటగట్టిన వ్యాపారిపై చర్యలు తీసుకుని తనకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నాడు.


