బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

Feb 8 2026 4:11 AM | Updated on Feb 8 2026 4:11 AM

బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

గార్లదిన్నె: బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం పొందిన ఘటన మండల పరిధిలోని కమలాపురంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్‌ బాషా తెలిపిన మేరకు.. కమలాపురం గ్రామానికి చెందిన చింతబరరెడ్డి, జయలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకర్‌ రెడ్డి (21) బెంగళూరులోని గీతం యూనివర్సిటీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామం వచ్చాడు. శ్రీకర్‌ రెడ్డి మొదటి, ద్వితీయ సంవత్సరంలోని కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు తెలిసింది. తోటి స్నేహితులు పాస్‌ కావడం, ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యం బాధపడుతుండేవాడని సమాచారం. ఈ క్రమంలో శనివారం తమ వ్యవసాయ తోటలో చీనీ చెట్లకు మందు పిచికారీ చేయడానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన శ్రీకర్‌ రెడ్డి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు 108 సాయంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

కూడేరు: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అరవకూరు–కమ్మూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం నేరహళ్లికి చెందిన లారీ డ్రైవర్‌ వీరన్న (34) హొస్పేట్‌ నుంచి ధర్మవరానికి సిమెంట్‌ బస్తాలు తీసుకుని వెళుతున్నాడు. మార్గమధ్యంలోని అరవకూరు–కమ్మూరు వద్ద శనివారం వేకువ జామున ఎదురుగా గుర్తు తెలియని వాహనం లారీని ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన వీరన్న లారీలోనే మృతి చెందాడు. అటుగా వెళుతున్న వాహనదారులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. వీరన్న సోదరుడు ముత్తప్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు.

కొర్రకోడు హైస్కూల్‌

పీఈటీ తీరుపై విచారణ

కూడేరు: మండల పరిధిలోని కొర్రకోడు హైస్కూల్‌ పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయుడు) మల్లికార్జున రెడ్డి తీరుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మద్యం సేవించి విధులకు వస్తున్నాడని, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీఈఓ ప్రసాద్‌ బాబు ఆదేశాల మేరకు శనివారం డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు కొర్రకోడు పాఠశాలలో విచారణ చేపట్టారు. బాలికలు, ఉపాధ్యాయులు, పలువురు తల్లిదండ్రులను విచారించారు. మద్యం సేవించి రావడం, ఎక్కువగా సెలవులు పెట్టడం, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు డిప్యూటీ డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఈటీ సెలవులో ఉన్నారు. విచారణలో వెల్లడైన విషయాలను నివేదిక రూపంలో డీఈఓకి అందజేస్తామని డిప్యూటీ డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ మహమ్మద్‌ గౌస్‌, హెచ్‌ఎం గాయిత్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement