ఎనర్జీ అసిస్టెంట్లకు సర్వే కష్టాలు
అనంతపురం టౌన్: సచివాలయాల పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని 25 ఇళ్లలోని కుటుంబ సభ్యుల వివరాలను ప్రతి రోజూ ఆధార్ ఈ కేవైసీ చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన కచ్చితమైన ఆధారాఆలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈ సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో సచివాలయ పరిధిలోని ఉద్యోగులు సర్వే తప్పనిసరిగా చేయాల్సి వస్తోంది. ప్రతి ఉద్యోగి కూడా సర్వే ప్రక్రియలో పాల్గొని సమగ్ర వివరాలతో నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఎనర్జీ అసిస్టెంట్లకు తిప్పలు
ఎనర్జీ అసిస్టెంట్ల ఎంపిక గతంలో సచివాలయాల పరిధిలో జరిగింది. వారిని సైతం సచివాలయాల ఉద్యోగుల కిందనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. దీంతో వారు సైతం తమ సచివాలయాల పరిధిలోని ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను మొబైల్ యాప్ ద్వారా (యూఎఫ్‌ఎస్) సర్వే చేయాలని, క్లష్టర్ పరిధిలోని ఇళ్ల వివరాలను అధికారులు అందజేశారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ సైతం సర్వే చేయాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. రోజూ 10 కుటుంబాల వివరాలను సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఎనర్జీ అసిస్టెంట్లు తమ పరిధిలోని విద్యుత్ శాఖ ఏఈల ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. సర్వే చేయాలని ఎస్‌ఈ ఆదేశాలు ఇచ్చినా.. మీరు మాత్రం సర్వేకు వెళ్లకూడదని ఏఈలు అడ్డుకుంటున్నారు. జీతాలు విద్యుత్ సంస్థ ఇస్తోంది కాబట్టి అందరూ ఎస్పీడీసీఎల్ సంస్థ ఉద్యోగులుగానే పరిగణించబడుతారని, ప్రతి ఒక్కరూ విద్యుత్ బిల్లులు కొట్టాల్సిందేనంటూ ఏఈలు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఎనర్జీ అసిస్టెంట్లకు తిప్పలు తప్పడం లేదు.
గతంలో షోకాజ్ నోటీసులు
జిల్లా వ్యాప్తంగా 350 మందికి పైగా ఉద్యోగులు సచివాలయాల పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్లుగా ఎంపికై విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో పని చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం సూచించిన కౌశలం, సిటిజన్ ఈకేవైసీ, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌పై డోర్ టూ డోర్ సర్వే చేయలేదని 137 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజాగా సర్వే చేయకుంటే మరోమారు నోటీసులు ఇచ్చే అవకాశమూ లేకపోలేదు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి సర్వేలో పాల్గొనని ఉద్యోగుల వివరాలపై నివేదికలు ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఎనర్జీ అసిస్టెంట్లు సర్వే చేయకపోవడంతో మరో మారు వారికి తాకీదులు అందే అవకాశం లేకపోలేదు.
విద్యుత్ సబ్ స్టేషన్
సర్వే తప్పనిసరి చేస్తూ ఉన్నతాధికారి ఆదేశాలు
సర్వేలు వద్దని ఏఈల ఒత్తిళ్లు
ఇద్దరి మధ్య నలుగుతున్న
ఎనర్జీ అసిస్టెంట్లు


