ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ రేపు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మహాజనసభ ఈ నెల 8న (ఆదివారం) ఉదయం 9 గంటలకు అనంతపురంలోని డీఎంహెచ్‌ఓ కమిటీ హాలులో నిర్వహించనున్నట్లు ఏపీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు సి.వరప్రసాద్, రాఘవేంద్ర, శివానంద, సిద్ధయ్య, సాకే చంద్ర, రామకృష్ణ, కిరణ్‌యాదవ్, బి.మహేంద్ర తెలిపారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను శుక్రవారం అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల (జీఎంసీ) వారు విడుదల చేసి, మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంస్థాగతంగా సంఘం బలోపేతం లక్ష్యంగా మహాజనసభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతి నెలా రెండో శనివారం ‘హలో ఔట్‌సోర్సింగ్ ఏపీ’ పేరుతో గ్రీవెన్స్ నిర్వహిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర నాయకులు, జేఏసీ నేతలు హాజరుకానున్న మహాజనసభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బోర్‌వెల్ రాడ్ పడి వ్యక్తి మృతి
బ్రహ్మసముద్రం : బోర్‌వెల్ రాడ్ తలపై పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రం గ్రామానికి చెందిన రైతు చాకలి రామన్న పొలంలో గురువారం అర్ధరాత్రి బోర్ వేస్తుండగా పలువురు గ్రామస్తులు చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో బోర్‌వెల్ హైడ్రాలిక్ రాడ్ ఉన్నఫళంగా జారి అక్కడే ఉన్న గొల్ల అజ్జప్ప(45) తలపై పడింది. ఘటనలో అజ్జప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు.
క్రైస్తవ మిషనరీ ఆస్తుల
పరిరక్షణకు చర్యలు
● రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్
గుత్తి: రాయలసీమ డయాసిస్ పరిధిలో ఉన్న క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్ తెలిపారు. గుత్తి సీఎస్‌ఐ చర్చిలో పాస్టర్లు, క్రైస్తవ సంఘం సభ్యులతో శుక్రవారం ఆయన సమావేశమై మాట్లాడారు. క్రైస్తవ మిషనరీ ఆస్తులను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు ఎమ్మెల్యే , ఇతర ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. అనంతరం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను బిషప్‌తో పాటు క్రైస్తవ సంఘం పెద్దలు, పాస్టర్లు సన్మానించారు. కార్యక్రమంలో డివిజనల్ చైర్మన్ డేవిడ్ నాయక్, ఎంఎస్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ రస్సెల్ కిరణ్, బిషప్ సతీమణి భారతి, క్రైస్తవ సంఘం సభ్యులు విజయ్‌కుమార్, సునీల్, విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలు
రాయదుర్గం టౌన్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడగా, ప్రమాదానికి కారణమైన విద్యార్థి సైతం తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. శుక్రవారం ఉదయం రాయదుర్గంలోని బాలికల జూనియర్ కళాశాల ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన తస్మియ కాలేజీకి వెళుతున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా, కణేకల్లు రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న డి.హీరేహాళ్ మండలం తమ్మేపల్లికి చెందిన పవన్ బస్టాండ్ వైపు నుంచి వేగంగా బైక్‌పై దూసుకొచ్చి ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థులను స్థానికులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ రేపు
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ రేపు


