పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
గుత్తి: మాయమాటలతో ఇంటర్ విద్యార్థిని లోబర్చుకుని గర్భిణిని చేసిన కేసులో ఆటో డ్రైవర్ ఓబుళపతిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను శుక్రవారం రాత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామారావు వెల్లడించారు. గుత్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఆటోడ్రైవర్ ఓబుళపతి రోజూ విద్యార్థులను గుత్తికి తెచ్చేవాడు. ఈ క్రమంలో పరిచయమైన ఇంటర్ అమ్మాయికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రస్తుతం బాలిక ఆరు నెలల గర్భిణి. ఈ విషయం రెండు రోజుల క్రితం బయట పడింది.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ ఓబుళపతిపై పోక్సో యాక్ట్‌తో పాటు రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
దేశ వ్యాప్త సమ్మెకు వైఎస్సార్‌టీయూ మద్దతు
అనంతపురం: ఆల్ ట్రేడింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ మద్దతు తెలిపింది. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను అనంతపురంలోని ఎన్జీఓ హోంలో శుక్రవారం ఆవిష్కరించి, మాట్లాడారు. 2025, నవంబర్ 21నుంచి అమల్లోకి వచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. ఇవి అమల్లోకి వస్తే కార్మికుల్లో కొనుగోలు శక్తి 90 శాతం నశిస్తుందనపి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దన్నుగా నిలిచేలా లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపంగి రామాంజినేయులు, రాజారత్నం, జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్, నగర కార్యదర్శి కాకర్ల శ్రీనివాసరెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్, నగర కార్యదర్శి ముత్తుజ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, కృష్ణుడు, రాజు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ఏఐసీసీటీయూ వేమన తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతగా పని చేయలేరా?
● డ్వామా పీడీ సలీం బాషా
కూడేరు: నిబంధనల మేరకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి, రికార్డులు, నేమ్‌బోర్డుల నిర్వాహణ సక్రమంగా చేపట్టలేరా? అంటూ మండల ఉపాధి సిబ్బందిపై డ్వామా పీడీ సలీం బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కూడేరులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ కుళ్లాయి స్వామి అధ్యక్షతన 18వ సోషియల్ ఆడిట్ ఓపెన్ ఫోరం జరిగింది. 2024, ఏప్రిల్ నుంచి 2025, మార్చి 31 వరకు జరిగిన రూ.7.26 కోట్ల ఉపాధి పనులపై క్షేత్ర స్థాయిలో చేపట్టిన తనిఖీ వివరాలను సోషియల్ ఆడిట్ రాష్ట్ర రీసోర్స్ పర్సన్ నీలకంఠ వెల్లడించారు. కొలతల్లో తేడా, చనిపోయిన వారి పేరిట బిల్లులు, మొక్కలు నాటకున్నా నాటినట్లు రికార్డుల్లో నమోదు చేసి సుమారు రూ.45 లక్షల మేర దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగం మోపారు. దీంతో బాధ్యులైన సిబ్బందిపై డ్వామా పీడీ మండిపడ్డారు. రికార్డుల నిర్వాహణ సక్రమంగా చేపట్టడం చేతకాదా? అని ప్రశ్నించారు. అభియోగాలపై విచారణ జరిపిన పీడీ, ఇతర అధికారులు రూ.50 వేలు రికవరీతో పాటు రూ .65 వేలు జరిమానా, రూ.17 లక్షల పనులపై ఏపీడీ విచారణకు, రూ.3.20 లక్షలు రీప్లాంటేషన్‌కు ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పీడీ సుధాకర్ రెడ్డి, డీవీఓ శ్రీనివాసులు, ఏపీడీ చెన్నకేశవులు, ఏపీఓలు తులసీప్రసాద్, పోలేరయ్య, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్


