చంద్రశేఖర్ గణిత ప్రదర్శనలు రాష్ట్రానికే ఆదర్శం
● డీఈఓ ప్రసాద్‌బాబు
ఉరవకొండ: ‘టచ్ ఎంజాయ్ అండ్ లర్న్ మ్యాథ్స్’ విధానంతో విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని పొగొట్టేలా మ్యాథ్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన ఉరవకొండ ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ గణిత ప్రదర్శనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయని డీఈఓ ప్రసాద్‌బాబు కొనియాడారు. దక్షిణ భారత టీచర్స్ ఎగ్జిబిషన్‌లో ఉత్తమ ప్రదర్శనకు అవార్డు అందుకున్న గణిత ఉపాధ్యాయుడు ఆకుతోట చంద్రశేఖర్ అభినందన కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఈఓ ప్రసాద్‌బాబు, విశ్రాంత డీవైఈఓ మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రశేఖర్ ఆవిష్యరణలు అద్భుతమన్నారు. గణితంపై విద్యార్థుల్లో సహజసిద్ధంగా ఉన్న భయాన్ని పొగొట్టి, వారితో నూతన ఆవిష్కరణలు చేయిస్తుండడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవిప్రసాద్, సీఐ మహనంది, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షాషావలి, ఎంఈఓలు ఈశ్వరప్ప, రమాదేవి, ఏడీ మునీర్, పర్యవేక్షకులు ఆదినారాయణ, సీనియర్ ఉపాధ్యాయుడు పాండురంగ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
వచ్చే నెల జరిగే పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలను డీఈఓ ప్రసాద్‌బాబు సూచించారు. విద్యాంజలి కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎంలకు శుక్రవారం స్థానిక ఎమ్మార్సీలో ఏర్పాటు చేసిన ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఈశ్వరప్ప, రమాదేవి పాల్గొన్నారు.


