అనంతపురం అగ్రికల్చర్: ఈ–పంట, రైతులకు విశిష్ట నంబరు కేటాయింపు లక్ష్యాలు నెలాఖరులోపు పూర్తి కావాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి (డీఏఓ) ముదిగల్లు రవి ఆదేశించారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీఏలు, టెక్నికల్ ఏఓలతో ఆయన సమీక్ష నిర్వహించారు. రబీ ఈ–క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే)లో కొన్ని మండలాల్లో వెనుకబడినందున వేగవంతం చేయాలన్నారు. నెలాఖరులోపు తుది ముసాయిదా ప్రభుత్వానికి పంపాల్సి ఉందన్నారు. రైతులకు 11 అంకెలు కలిగిన యూనిక్ నెంబరు (విశిష్ట సంఖ్య) కేటాయింపు వారం రోజుల్లో పూర్తి కావాలన్నారు. రైతుల పొలాల్లో 23,711 మట్టి నమూనాలు సేకరించి విశ్లేషణకు ప్రయోగశాలకు పంపే కార్యక్రమం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. అలాగే అనంతపురం ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ కూడా గురువారం తన కార్యాలయంలో డివిజన్ పరిధిలో ఉన్న ఆరు మండలాల ఏఓలతో ఇవే అంశాలపై సమావేశం నిర్వహించారు.
బాలికను గర్భిణిని చేసిన ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు
గుత్తి రూరల్: మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ బాలికను గర్భిణిని చేసిన ఆటోడ్రైవర్‌పై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలమేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఓబుళపతి అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో లైంగికంగా లోబరుచుకొని గర్భిణిని చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. బాలిక తెలిపిన వివరాలమేరకు ఆటోడ్రైవర్ ఓబుళపతిపై పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
కుందుర్పి: జిల్లాలోని అన్ని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు, 6 నుంచి 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ అస్రత్‌వలి సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందని, నేటి నుంచి మార్చి 4 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12న, 6 నుంచి 8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అదే నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం https:// mjpapbcwrcis.apcfss.inను సంప్రదించాలని సూచించారు.


