కాలవా... కాస్త చూడవా!
కణేకల్లు వేదవతి హ గరిపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆరు నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. రెండేళ్లలో పనులు పూర్తి చేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గొప్పలు చెప్పుకున్నా.. క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. పనులు ఇలా చేస్తే బ్రిడ్జి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందోనని ప్రజలు మండిపడుతున్నారు.
కణేకల్లు: మండల పరిధిలోని వేదవతి హగరిపై బ్రిడ్జి నిర్మాణం రాయదుర్గం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక. రాయదుర్గం నుంచి ఉరవకొండ, గుంతకల్లు రాకపోకలకు ఉన్న ఏకై క మార్గం ఇది. కణేకల్లు మీదుగా ఉరకొండ, గుంతకల్లుకు వెళ్లాల్సి ఉంది. గతంలో బస్సులు, కార్లు, లారీలు ఇతరాత్ర వాహనాలన్నీ వేదవతి హగిరిపై ఉన్న హెచ్చెల్సీ అక్విడెక్ట్ మీదుగా రాకపోకలు కొనసాగించేవీ. ఈ అక్విడెక్ట్ సుమారు 60 ఏళ్ల క్రితం నిర్మించింది కావడంతో ఇది కాస్తా ప్రమాదకర పరిస్థితికి చేరుకొంది. దీంతో హెచ్చెల్సీ అధికారులు అక్విడెక్ట్ మీదుగా వాహనాల రాకపోకలను పూర్తి నిషేధించారు. వేదవతి హగరిపై బ్రిడ్జి అవసరాన్ని గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా ముగించింది. అగ్రిమెంట్‌తో పాటు పలు సాంకేతిక సమస్యల కారణంగా పనులు ప్రారంభం కాలేదు.
16 నెలల క్రితం పనులకు భూమి పూజ
అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం పెరిగిన రా మెటిరియల్ ధరలకు అనుగుణంగా బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని రూ.48.42 పెంచింది. 2004 సెప్టెంబర్ 26న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయించే బాధ్యత తనదేనన్నారు. ఇప్పటికే పదహారు నెలలు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం మరో ఎనిమిది నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయడం అసాధ్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనుల నిర్వహణకు కొన్ని చిక్కుముడులుండటంతో కాంట్రాక్టర్ రోడ్డు ఎర్త్ వర్క్ చేసి ఎక్కడికక్కడే పనులు ఆపేశాడు.
అలైన్‌మెంట్ మార్పుతోనే..
హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగడానికి ఆర్‌అండ్‌బీ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. గతంలో హెచ్చెల్సీ అక్విడెక్ట్‌కు కొంత దూరంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు అనుకొన్నారు. అయితే ఆ ప్రాంతంలో శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పైప్‌లైన్ ఉన్న విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో బ్రిడ్జి అలైన్‌మెంటు మార్చాల్సి ఉంది. బ్రిడ్జి అలైన్‌మెంటు మార్పుతో డిజైన్ మార్పు కూడా అనివార్యమైంది. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ అధికారులు బ్రిడ్జి డిజైనింగ్ రూపకల్పనలో ఉన్నట్లు సమాచారం. మరో వైపు ఈ బ్రిడ్జి నిర్మించే ప్రదేశం ఫారెస్ట్ శాఖ పరిధిలో కొంత భాగం వస్తోంది. రిజర్వ్ ఫారెస్ట్ స్థలాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంటు ఆర్‌అండ్‌బీ శాఖకు బదిలీ చేయాల్సి ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడానికి ఇది మరో కారణమని తెలుస్తోంది.
వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్
రాయదుర్గ నుంచి ఉరవకొండకు బస్సులు, లారీలు, కార్లు, ఇతరాత్ర వాహనాలన్నీ కణేకల్లు–మాల్యం మీదుగా వేదవతి నదిపై రాకపోకలు సాగిస్తున్నాయి. వర్షం వస్తే నదిలో నీటి ప్రవాహం పెరిగి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈక్రమంలో హై లెవల్ బ్రిడ్జి పనులు 2004 సెప్టెంబర్‌లో ప్రారంభం కావడంతో ప్రజలంతా ఈ బ్రిడ్జిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బ్రిడ్జి పూర్తయితే ఎలాంటి వరదలొచ్చినా సమస్య ఉండదని భావించారు. అయితే బ్రిడ్జి నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో నిరాశ చెందుతున్నారు.
నత్తనడకన కణేకల్లు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు
రెండేళ్లలో పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే కాలవ హామీ
16 నెలలుగా ఎర్త్ వర్క్
మాత్రమే పూర్తి
అలైన్‌మెంటు మార్పుతో పనులకు బ్రేక్
కాలవా... కాస్త చూడవా!


