‘చలో ఢిల్లీ’లో పాల్గొన్న ఎస్టీయూ నాయకులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి, సీపీఎస్‌ను రద్దు చేయాలనే డిమాండ్లతో అఖిల భారత జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐజేఏసీటీఓ) ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు తెలిపారు. వారు మాట్లాడుతూ 2010 కంటే ముందు నియామకం పొందిన 30 లక్షల మంది ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పలు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. లేదా పార్లమెంట్ లో చట్టం చేయాలన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా నుంచి ఎస్టీయూ నాయకులు కృష్ణమూర్తి, సుధాకర్, చెన్నారాయప్ప, రవన్న, తిప్పేస్వామి, రాధాకృష్ణంరాజు, సుబ్బరామప్ప, శివలింగప్ప. మంజునాథ్, రామాంజనేయులు, చిరంజీవి పాల్గొన్నారు.


