వయసు నిర్ధారణకు టెన్త్‌ సర్టిఫికెట్‌ చాలు

టి.నరసాపురం కేసులో సీడబ్ల్యూసీ తీర్పు

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌ : బాలల న్యాయచట్టంలోని సెక్షన్‌ 94, వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు పరిగణనలోకి తీసుకుని వయసు నిర్ధారణకు వ్యక్తి 10వ తరగతి సర్టిఫికెట్‌ తుది ఆధారమని జిల్లా బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. జిల్లాలోని టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక కేసుకు సంబంధించి ఏలూరు శనివారపుపేటలోని సమితి కార్యాలయంలో సీడబ్ల్యూసీ తుది నిర్ణయం వెలువరించినట్టు సమితి చైర్‌పర్సన్‌ టీఎన్‌ స్నేహన్‌ తెలిపారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం రాజుపోతేపల్లికి చెందిన దేవరపల్లి బేబి అనే యువతి పెదవేగి మండలం ముండూరుకి చెందిన అన్నపనేని సందీప్‌ అనే యువకుడిని గతేడాది డిసెంబర్‌ 24న వివాహం చేసుకుంది.

అయితే వివాహంపై బే బి తండ్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ టి.నరసాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాను మేజర్‌నని తన టెన్త్‌ సర్టిఫికెట్‌ను బేబి పోలీసులకు చూపింది. అయితే ఆమె తండ్రి టెన్త్‌ సర్టిఫికెట్‌లో పుట్టినతేదీ తప్పని, పంచాయతీ కార్యాలయం ద్వారా మరో సర్టిఫికెట్‌ను తీసుకువచ్చి పోలీసులకు చూపించారు. దీంతో కేసును పోలీసులు సీడబ్ల్యూసీ ముందుంచారు. తండ్రి చూపిన సర్టిఫికెట్‌ ఆధారంగా బేబిని మైనర్‌గా భావించి సీడబ్ల్యూసీ సూచనలతో గతనెల 12న ఆమెకు దెందులూరు బాలసదన్‌లో ఆశ్రయం కల్పించారు. సంక్రాంతి సెలవుల అనంత రం బేబీని పోలీసులు సీడబ్ల్యూసీ ముందు హాజరుపరిచారు. ఇరువర్గాల వాదోపవాదాల అనంతరం వయసు నిర్ధారణకు టెన్త్‌ సర్టిఫికెట్‌ ప్రామాణికమని భావించి తుది తీర్పు వెల్లడించారు. బేబి చదివిన మూడు పాఠశాలల్లో పుట్టినతేదీ ఒకేవిధంగా ఉందని, ఆమెకు 18 ఏళ్లు నిండినట్టు నిర్ధారించారు.

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top