పెద్దనోట్లతో రద్దుతో దేశంలోని ఏ బ్యాంకును చూసినా.. ఏ ఏటీఎంను పరికించినా సామాన్యుడి కష్టాలే కనిపిస్తున్నాయి.
పెద్దనోట్ల రద్దుతో దేశంలోని ఏ బ్యాంకును చూసినా.. ఏ ఏటీఎంను పరికించినా సామాన్యుడి కష్టాలే కనిపిస్తున్నాయి. నాగుపాములా వంకలు వంకలు తిరుగుతూ భారీ క్యూలు.. ఆ క్యూలలో రెక్కాడితేగానీ డొక్కాడని పేదల ఎదురుచూపులు. తమ వద్ద ఉన్న వెయ్యి, రెండువేలు బ్యాంకు నుంచి తీసుకోవడానికి సామాన్యులు, నిరుపేదలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ బ్యాంకు ముందు సంపన్నుడు నిలబడినా దాఖలా లేదు. సంపన్నుడు ఎలాగోలా క్యూలో నిలబడకుండానే తమ విలాసాలకు కావాల్సిన డబ్బును సమకూర్చుకోగలుగుతున్నాడు. కానీ, సామాన్యులకు క్యూలో నిలబడక తప్పని పరిస్థితి.
ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంల ముందు సామాన్యులు పడుతున్న కష్టాలకు దర్పణంగా నిలిచిన ఓ ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయింది. గుర్గావ్‌లో డబ్బు కోసం బ్యాంకు ముందు భారీ క్యూలో నిలబడిన వృద్ధుడు.. అంతలో తన స్థానం గల్లంతై.. తనను క్యూ నుంచి తోసేయడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. అతడి అరణ్యరోదన ఇప్పుడు ఆన్‌లైన్‌లో నెటిజన్లను కదిలిస్తోంది. బ్యాంకుల ముందు సామాన్యల కష్టాలకు ఈ ఫొటో దర్పణం పడుతోంది. పెద్దనోట్ల రద్దుతో సంపన్నులు మాత్రమే విలపిస్తారని నేతలు ఉపన్యాసాలు దంచుతున్నారు. కానీ ఇక్కడ చూడండి.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అంటూ పలువురు నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేసుకుంటున్నారు. హిందూస్తాన్ టైమ్స్ ఫొటోగ్రాఫర్ ప్రవీన్ కుమార్ ఈ ఫొటోను తీశారు.