
‘బెండిట్ లైక్ బాబా రామ్‌దేవ్’
పార్లమెంట్ సభ్యులు, బాలివుడ్ తారల మధ్య జరిగిన ఛారిటీ ఫుట్ బాల్ మ్యాచ్ లో రాందేవ్ బాబా పాల్గొనడంపై ట్విట్టర్ లో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.
పార్లమెంట్ సభ్యులు, బాలీవుడ్ తారల మధ్య జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన ఓ ఫుట్‌బాల్ ఛారిటీ మ్యాచ్‌లో యోగా గురువు బాబా రామ్‌దేవ్ హల్‌చల్ చేసిన విషయం తెల్సిందే. అయితే దీనిపై సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్ యూజర్లు తమదైన రీతిలో ఫన్నీగా స్పందించారు. తనదైన శైలిలో కాషాయ అంగవస్త్రాన్ని ధరించిన బాబా ఫుట్‌బాల్‌ను తంతున్న దృశ్యాలను కొంత మార్ఫింగ్ చేసి చలోక్తులు విసిరారు.
‘బెండిట్ లైక్ బాబా రామ్‌దేవ్’ అంటూ 2002లో బ్రిటన్‌లో విడుదలైన భారతీయ ఇంగ్లీషు సినిమా ‘బెండిట్ లైక్ బెకమ్’ను గుర్తుచేశారు. ఆ తర్వాత భారత్‌లో విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చిన విషయం తెల్సిందే. గురివింద్ చద్దా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పర్మిందర్ నగ్రా ప్రధాన పాత్రను పోషించారు. ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెకమ్‌ను గుర్తుచేసేలా ఈ సినిమాకు టైటిల్ పెట్టారు. స్పైస్ గర్ల్స్‌తో బాబా రామ్‌దేవ్ డాన్స్ చేస్తున్నట్టుగా కూడా బాబా ఫుట్‌బాల్ ఆటను మార్ఫింగ్ చేసి నవ్వించారు.
బాబా ఫుట్ బాల్‌ను పట్టుకోవడం లేదని, ‘పోjrమాన్ గో’ గేమ్‌లోని పికాచూలను పట్టుకోడానికి వెళ్తున్నారని చూపించడమే కాక.. అందుకు తగినట్లుగా వ్యాఖ్యానాలు కూడా చేశారు. రియల్ ఫుట్‌బాల్ ప్లేయర్లకు రామ్‌దేవ్ ఫుట్‌బాల్ కిట్‌ను ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు. ఓ రాజకీయ పార్టీ నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు తంతున్నాడని కూడా వ్యాఖ్యలు చేసిన వారు లేకపోలేదు. ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా సరదా కోసమే అయినా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రికలైన ‘స్వచ్ఛ భారత్, బేటీ బచావో బీటీ పడావో’ పథకాలకు ప్రచారం కల్పించేందుకే ఈ చారిటీ మ్యాచ్‌ను నిర్వహించారన్నది నిర్వివాదాంశం.