
సమైక్యానికి అండగా నిలవండి : అశోక్‌బాబు
తెలంగాణపై కేంద్రం నోట్ సిద్ధం చేస్తోంది.. ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి దానిని అడ్డుకోవాలని, ఒకవేళ అది అసెంబ్లీ ఆమోదానికి వస్తే తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు.
రాయచోటి, న్యూస్‌లైన్ : తెలంగాణపై కేంద్రం నోట్ సిద్ధం చేస్తోంది.. ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి దానిని అడ్డుకోవాలని, ఒకవేళ అది అసెంబ్లీ ఆమోదానికి వస్తే తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు. రాజకీయ స్వార్థంతోనే విభజన అంశంపై తెరపైకి వచ్చిందని, తెలంగాణలో 60శాతం మంది రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో గురువారం జరిగిన ‘రాయచోటి రణభేరి’లో ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమం ప్రారంభమయ్యేనాటికి, నేటికీ పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తోపాటు, అన్ని పార్టీల నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు.
అయితే, ఆ విషయాన్ని బాహాటంగా ప్రకటిస్తే పార్టీలకు ఇబ్బందనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. మేం చెప్పినప్పుడు ఎంపీలు రాజీనామాలు చేసిఉంటే యూపీఏ సర్కార్ కూలిపోయేదని, కానీ ఆ పనిచేయలేదని మండిపడ్డారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలు పదవుల్లో ఉండాలని, అందుకే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు వెనక్కి తీసుకోవాలన్నారు. విప్ ధిక్కరించైనా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రమాణం చేయాలన్నారు. అందరూ తలుచుకుంటే ఏమవుతోందో ఆలోచించండని సూచించారు. మాకు పదవులు అక్కర్లేదు, కేవలం సమైక్యాంధ్ర కోసమే పోరాడుతున్నాం, 2014 ఎన్నికల్లోగా రాజకీయ బలంగా మారుతామని స్పష్టంచేశారు.
ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఇప్పటికే 5వేల కోట్ల రూపాయల నష్టంలో ఉందని, రాష్ట్రం విడిపోతే సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు. విభజనతో ఆర్టీసీకే ఇన్ని కష్టాలు ఉంటే మిగిలిన సంస్థలకు ఎన్ని సమస్యలుంటాయో ఆలోచించాలని సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. సీమ, దక్షిణ తెలంగాణ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటి కష్టాలు తీవ్రమవుతాయన్నారు. మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన హంద్రీనీవా, గాలేరు-నగరి, నెట్టెంపాడు, కల్వకుర్తి, వెలిగొండతోపాటు సోమశిల, తెలుగుగంగకు చుక్కనీరు రాదని చెప్పారు సమైక్యంగా ఉంటేనే సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఢిల్లీలో కొంతమంది భజనపరులు సమైక్య ఉద్యమాన్ని కించపరుస్తున్నారని, వారి నాలుకలు చీల్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏజేసీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో హైదరాబాద్ కీలకమైందని, దీంతో పాటు ఎన్నో చిక్కుముడులు ఉన్నాయని, వాటి పరిష్కారం అంత సులభం కాదని ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఈశ్వరయ్య, జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2014 ఎన్నికల్లోగా రాజకీయ నిర్ణయం
సాక్షి ప్రతినిధి, కడప : 2014 ఎన్నికల్లోగా తాము రాజకీయ నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు సమైక్యరాష్ట్రం కోసం పోరాడేవారికే తమ మద్దతు తెలుపుతామని ఏపీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. రాజకీయపార్టీల పట్ల స్పష్టమైన వైఖరిని వెల్లడించేందుకు ఈనెల 30న సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. కడపలోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబ్ల్యూసీ నిర్ణయం వెలువడగానే కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. రాజకీయ స్వార్థంతోనే విభజన అంశం తెరపైకి వచ్చిందని, పదిమంది పార్లమెంటు సభ్యుల గొడవ కారణంగా సీడబ్ల్యుసీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
హైదరాబాద్ ప్రధాన ఎజెండాగా మాత్రమే సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఉద్యమిస్తుంటే ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్ర ఏకైక లక్ష్యంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తున్నారని పార్టీల నిర్ణయం ఒకటైతే, సీమాంధ్రలో వ్యక్తుల నిర్ణయం మరోలా ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు కేంద్రానికి లేఖరాయాలని, దానిపై అన్ని పార్టీల అధ్యక్షులతో సంతకాలు చేయించాలని, తాను తొలి సంతకం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనపై అడిగిన ప్రశ్నకు అశోక్‌బాబు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్ర విభజన అసాధ్యమన్నారు.
ఉద్యమకారులపై టీడీపీ దాడి
సినీనటుడు మురళీమోహన్ సమక్షంలోనే దాష్టీకం
ద్వారకా తిరుమల, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమైక్యవాదులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో గురువారం సినీనటుడు, టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాగంటి మురళీమోహన్ సమక్షంలోనే ఇదంతా జరిగింది. సమైక్య ఉద్యమంలో భాగంగా మల్లేశ్వరం వద్ద రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లెపల్లెకు సమైక్యాంధ్ర పేరిట యూత్ర చేపట్టిన మురళీమోహన్ అటుగా వచారు. యూత్రకు దారి ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. సమైక్యాంధ్ర విషయంలో టీడీపీ విధానాన్ని స్పష్టం చేయకుండా యాత్రలు నిర్వహించడం ఏమిటని నిలదీశారు. దీంతో టీడీపీ నేతలు వారిని గెంటివేశారు. దీనిని వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డు కోవడంతో వారిపైనా దాడికి తెగబడడంతో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బుసనబోయిన సత్యనారాయణ, అక్కాబత్తుల కుటుంబరావు తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి.