
వెలుగులో ఆటో, మెటల్ షేర్లు
కొన్ని ఎంపికచేసిన షేర్లలో దేశీయ సంస్థలు వరుసగా రెండోరోజు కొనుగోళ్లు జరపడంతో బుధవారం స్టాక్ సూచీలు తొలి నష్టాల నుంచి కోలుకుని, స్వల్పలాభాలతో ముగిసాయి.
కొన్ని ఎంపికచేసిన షేర్లలో దేశీయ సంస్థలు వరుసగా రెండోరోజు కొనుగోళ్లు జరపడంతో బుధవారం స్టాక్ సూచీలు తొలి నష్టాల నుంచి కోలుకుని, స్వల్పలాభాలతో ముగిసాయి. ఎఫ్‌ఎంసీజీ, రిఫైనరీ షేర్లలో తొలుత అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్ 20,076 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అటుతర్వాత ఐటీ, మెటల్, ఆటోమొబైల్ షేర్లు పెరగడంతో సెన్సెక్స్ వేగంగా కోలుకుని, చివరకు 49 పాయింట్ల లాభంతో 20,261 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
ఇక నిఫ్టీ 5,963 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి రికవరీ అయ్యింది. చివరకు 21 పాయింట్లు లాభపడి 6,022 పాయింట్ల వద్ద ముగిసింది. తాజా ఫలితాల్లో తక్కువ నష్టాన్ని ప్రకటించిన ర్యాన్‌బాక్సీ 6 శాతంవరకూ ర్యాలీ జరపగా, మెటల్ షేర్లు టాటా స్టీల్, హిందాల్కో, ఎన్‌ఎండీసీలు 2-5% మధ్య పెరిగాయి. క్రితం రోజు ఫలితాలు వెల్లడించిన టెక్ మహీంద్రా 4% పెరగ్గా, టీసీఎస్, విప్రోలు 1-2.5% మధ్య ఎగిసాయి. ఆటో షేర్లు టాటా మోటార్స్, మహీంద్రా, బజాజ్ ఆటోలు 2-3 శాతం మధ్య పెరిగాయి. ఐటీసీ, రిలయన్స్, బీహెచ్‌ఈఎల్‌లు స్వల్పంగా తగ్గాయి.
నిఫ్టీ ఆప్షన్లలో పెరిగిన పుట్ బిల్డప్: సోమవారం 6,000 స్ట్రయిక్ వద్ద భారీ పుట్ రైటింగ్ జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు, మంగళ, బుధవారాల్లో ఇంట్రాడేలో 6,000 దిగువకు నిఫ్టీ పడిపోయినా, ఆ స్థాయిని ముగింపులో నిలబెట్టుకోగలిగారు. తద్వారా వారు విక్రయించిన పుట్స్ వల్ల నష్టంరాకుండా చూసుకున్నారు. ఒక రోజు ఐటీసీని, మరో రోజు టీసీఎస్‌ను కొనడం ద్వారా నిఫ్టీని 6,000 స్థాయిపైకి చేర్చగలిగినట్లు క్యాష్, డెరివేటివ్ డేటాలు వెల్లడిస్తున్నాయి.
తాజాగా ఇదే స్ట్రయిక్ వద్ద పుట్ ఆప్షన్లో మరో 5.83 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 75.75 లక్షల షేర్లకు చేరింది. 5,900 పుట్ ఆప్షన్లో కూడా బిల్డప్ 59.18 లక్షల షేర్లకు పెరిగింది. ఇంకా 6,000 కాల్ ఆప్షన్లో మాత్రం బిల్డప్ 25.45 షేర్ల వద్ద పరిమితంగా వున్నా, 6,100 కాల్ ఆప్షన్లో బిల్డప్ 43.85 లక్షల షేర్లకు చేరింది. సమీపంలో 6,000పైన స్థిరపడితే నిఫ్టీ క్రమేపీ 6,100 స్థాయికి చేరచ్చన్నది డేటా సూచన.