
మన వద్ద భూకంపం వస్తే ఆ నగరాలు ఖల్లాసే!
భారత దేశంలోని అసోంలోని గువాహటి, జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ నగరాలు మాత్రం చాలా జాగ్రత్తగా ముందస్తు వ్యూహంతో ఉండాలని నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ డీఎం) హెచ్చరిస్తోంది.
న్యూఢిల్లీ: భారత దేశంలోని అసోంలోని గువాహటి, జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ నగరాలు మాత్రం చాలా జాగ్రత్తగా ముందస్తు వ్యూహంతో ఉండాలని నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ డీఎం) హెచ్చరిస్తోంది. దీంతోపాటు మరో 36 నగర ప్రాంతాలు కూడా భూప్రకంపనలకు తావిచ్చేవిగా ఉన్నాయని చెప్పింది. దేశంలోని భూకంప బారిన పడే నగరాల్లో ఇవే ముందు వరుసలో ఉన్నట్లు తాజాగా తన డేటాలో పేర్కొంది. జోన్-5 అత్యంత ప్రమాదకరమైనదని, ఇక్కడ అతి తీవ్ర భూకంపాలు వస్తాయని హెచ్చరించింది.
ఇక నాలుగో జోన్ తీవ్ర భూకంపం సంభవించే జోన్ అని ఇందులో ఢిల్లీతో సహా మొత్తం ఎనిమిది నగరాలు ఉన్నాయని తెలిపింది. మరో 30 నగరాలు మాత్రం స్వల్పంగా భూప్రకంపనలు(జోన్-3) వ్యాపించే చోట ఉన్నాయని వెల్లడించింది. దురదృష్టం కొద్ది ఈ నగరాల్లో భవంతులు అన్నీకూడా భూకంపాలను తట్టుకునే విధంగా లేవని, పైగా జనాభా కూడా ఎక్కువగా ఇక్కడ ఉండటంతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. నేపాల్ భూకంపం నేపథ్యంలో ఎన్డీఎం ఈ డేటాను సేకరించి ముందుస్తుగా వెల్లడించింది.