విద్యతోనే మహిళా సాధికారత

Women Empowerment with Education - Sakshi

మహిళాదక్షత సమితి రజతోత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: విద్యతోనే మహిళాసాధికారత సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఇక్కడ చందానగర్‌లో జరిగిన మహిళా దక్షత సమితి రజతోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పేద, అట్టడుగు వర్గాలవారికి సమితి విద్యనందించడం అభినందనీయమని అన్నారు. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, మతాలు, భాషలకు నిలయమైన మనదేశం భిన్నత్వంలో ఏకత్వంగా నిలుస్తోందన్నారు. వేద, పురాణ కాలాల్లో కూడా మహిళలకు సముచిత గౌరవం దక్కిందని, పార్వతి లేకపోతే శివుడు కూడా అశక్తుడేనని శంకరాచార్యులు అన్నారని గుర్తుచేశారు.

రజియా సుల్తానా, రాణి దుర్గావతి, రాజమాత జిజియా బాయి, కవయిత్రి మొల్ల, రాణీ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి తదితర మహిళామణుల గొప్పతనం గురించి ఆయన వివరించారు. దేశంలోని ప్రముఖ నదుల పేర్లు గంగా, యమున అని ఉన్నాయన్నారు. పీవీ సింధు వంటి వారు సకల రంగాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలతో దేశ గౌరవం మంటగలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కోసం చట్టాలు చేస్తే సరిపోదని, ప్రజల ఆలోచనల్లో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. మహిళలకు అవకాశం, ప్రోత్సాహమిస్తే సమర్థవంతంగా రాణిస్తారన్నారు.

పార్లమెంటులో మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం
దేశంలో 50 శాతమున్న మహిళలకు పార్లమెంట్‌లో 11.7 శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందని, స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా మహిళల అక్షరాస్యతాశాతం తక్కువగానే ఉందని వెంకయ్య విచారం వ్యక్తం చేశారు. సమానపనికి సమాన వేతనం ఉండాలని, ఇళ్లల్లో మాతృభాషలోనే మాట్లాడాలన్నారు. గోవా గవర్నర్‌ మృదులా సిన్హా మాట్లాడుతూ పేదరికంలో ఉన్న మహిళలకు విద్యనందించడంలో సమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపొద్దని కోరారు. మహిళలపై అత్యాచారాలు జరగకుండా రక్షణ కల్పించాలన్నారు.

సమితి ప్రెసిడెంట్‌ సరోజ్‌ బజాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సమితి ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ అరుణ మాలిని తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top