ఆలస్యంగా.. ఆఖరిచూపులు

very late..last sights - Sakshi

కన్నీరుమున్నీరుగా  విలపించిన   గిరిజన కుటుంబీకులు

బాధితుల తండాల్లో  విషాద ఛాయలు

పలువురి పరామర్శ,  ఆర్థికసాయం 

పొట్టకూటికోసం దేశంకాని దేశానికి వెళ్లిన వలసజీవులు విగతజీవులుగా మారి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. సౌదీ అరేబియాలో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలు ఆలస్యంగా రావడంతో వారి కుటుంబసభ్యులు కడసారిగా చూసి తల్లడిల్లిపోయారు. కష్టపడి నాలుగురాళ్లు సంపాదించుకుని వస్తారనుకుంటే ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోయారా.. అంటూ వారు రోదించిన తీరు ప్రజలను కలిచివేసింది. 

హన్వాడ/గుండేడ్‌ (మహబూబ్‌నగర్‌): హన్వాడ మండలం నాగంబాయితండాకు చెందిన ఆంగోత్‌ శంకర్‌నాయక్‌(45) బతుకుదె రువు నిమిత్తం సౌదీఅరేబియాకు వెళ్లాడు. వెళ్లిన కొన్ని నెలలకు శంకర్‌ అకస్మాత్తుగా అస్వస్తతకు గురయ్యాడు. తోటి మిత్రులు సౌదీలోని రియాద్‌ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం అందిస్తుండగా అదే ఆస్పత్రిలో గత జనవరి 13న ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి నేటి వరకు భార్యాపిల్లలు, బంధువులు కడసారి చూపుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు.

మృతదేహం కోసం భార్య గంగమ్మ పలుమార్లు కలెక్టర్‌ మొదలుకుని ఎమ్మెల్యే వరకు ప్రాధేయపడింది. ఫలితం దక్కకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా గ్లోబల్‌ బంజారా వెల్ఫేర్‌ సొసైటీ వారు బాసటగా నిలిచారు. శంకర్‌ మృతదేహాన్ని రప్పించేందుకు  జీబీడబ్ల్యూఎస్‌ వారిని ఆశ్రయించారు. ఇందుకోసం రూ.1.25లక్షల ఖర్చు అవుతుండగా వారే భరించి సౌదీ నుంచి ముంబాయికి, అటునుంచి హైదరాబాద్‌కు తెప్పిం చారు. మృతదేహాన్ని చూ సిన వెంటనే కుటుంబసభ్యులు ఒక్కసారిగా బోరుమన్నారు.   

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం 
గ్లోబల్‌ బంజారా వెల్ఫేర్‌ సొసైటీ వారు బాధిత కుటుంబానికి రూ.62వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఆదుకోవాలని వెల్ఫేర్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఎం.రవినాథ్‌ డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర నూతన కమిషన్‌ సభ్యులు రాంబల్‌ నాయక్, చిలకమర్రి నర్సింహులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 

వలసకూలికి అంత్యక్రియలు 
గండేడ్‌ మండలం షేక్‌పల్లి తండాకు చెందిన దేవిజానాయక్‌ (48) సౌదీ అరేబియాకు వలస వెళ్లి ఈనెల 13న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం 14 రోజుల అనంతరం స్వగ్రామానికి రాగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శాంతీబాయి కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం కుటంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top