మూడోరోజూ ఉద్రిక్తత

Students Protest Continue Third Day Also - Sakshi

ఇంటర్‌ బోర్డు ఎదుట కొనసాగిన ఆందోళనలు

రోడ్డుపై విద్యార్థులు, తల్లిదండ్రుల బైఠాయింపు

సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు

న్యాయం చేయాలని డిమాండ్‌

కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

హైదరాబాద్‌: తోపులాటలు.. నినాదాలు... అరెస్టుల మధ్య తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయం వద్ద మూడో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగింది. ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలకు నిరసనగా బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో విద్యా ర్థులు, తల్లిదండ్రులు మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఉన్న నాంపల్లికి చేరుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి జత కలిశారు. వారంతా బోర్డు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కార్యాలయం వద్ద ఉన్న రోడ్డు పొడవునా పోలీసులు బారికేడ్లను, ముళ్ల కంచెలను అమర్చడంతోపాటు మూడంచలుగా మోహరించి ఉండటంతో ఆందోళనకారులు లోపలకు వెళ్లలేకపోయారు. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని ఫెయిలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

పోలీసులతో తల్లిదండ్రుల వాగ్వాదం..  
ఇంటర్‌ బోర్డు లోపలకు వెళ్లేందుకు ఓ టీఆర్‌ఎస్‌ నేతను పోలీసులు అనుమతించడంపై విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు వెనక్కి తగ్గారు. లోపలకు వెళ్లేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ నేతను వెనక్కి పంపించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే మీడియా ప్రతినిధులతోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇంటర్మీడియెట్‌ బోర్డు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌ సహా మరికొందరు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఆందోళనకారులను అక్కడి నుంచి వాహనాల్లో బేగంబజార్, నాంపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రమేశ్, పీడీఎస్‌యూ నేత నాగరాజు, మాదిగ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు ఇ. విజయ్‌ మాదిగ, విద్యార్థి జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ఎన్‌. రమేశ్‌ ముదిరాజ్, టీఎన్‌ఎస్‌ఎఫ్, టీడీఎఫ్‌ నేతలు సాయిబాబా, బాలరాజ్‌ గౌడ్, మధుకర్‌ ఉన్నారు.  

ఉదయాన్నే కార్యాలయానికి బోర్డు సిబ్బంది...  
ఇంటర్మీడియెట్‌ బోర్డులో పనిచేసే సిబ్బంది ఉదయం 8 గంటలకే డ్యూటీలకు వచ్చారు. ఆందోళనకారులు రాక ముందే కార్యాలయానికి చేరుకున్నారు. మొదటి రెండు రోజుల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బోర్డు సిబ్బంది అంతా ఉదయాన్నే విధులకు హాజరు కావాలని బోర్డు కార్యదర్శి ఆదేశించడంతోనే వారంతా సమయంకన్నా ముందే ఆఫీసుకు చేరుకున్నట్లు తెలిసింది. ఉదయాన్నే లోపలకు వెళ్లిన ఉద్యోగులు బయటకు రావడానికి వీలు కాలేదు. సాయంత్రం 6 తరువాతే వారు ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

రాత్రివేళ ఉన్నతాధికారుల సమీక్ష...  
మంగళవారం సాయంత్రం తర్వాత ఉద్రిక్తత చల్లబడటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. ఫలితాల్లో తప్పిదాలు, గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వారు బోర్డు కార్యదర్శితో సమీక్షించినట్లు సమాచారం. రాత్రి 8 గంటలకు మొదలైన ఈ సమావేశం రాత్రి 10 గంటల వరకు కొనసాగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రీ కౌంటింగ్, రీ వ్యాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షలపై వారు చర్చించినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top