కేసీఆర్‌కు సునీతారెడ్డి అంటే భయం

Revanth Reddy Slams On KCR Medak - Sakshi

పైరవీలు చేయదు,  పైసలు అడగదు 

సునీతమ్మను ఆశీర్వదించి, గెలిపించండి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి 

జీవితం ప్రజా సేవకే అంకితం: సునీతారెడ్డి

సాక్షి, నర్సాపూర్‌ (మెదక్‌): మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీతారెడ్డి అంటే సీఎం కేసీఆర్‌కు భయమని  టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో చేపట్టిన రోడ్‌ షో సందర్భంగా  అంబేద్కర్‌  చౌరస్తాలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. సునీతారెడ్డి పైరవీలు చేయదని, పైసలు అడగదని ఆయన వివరిస్తూ అందుకే ఆమె అంటె కేసీఆర్‌కు భయమని చెప్పారు. పైరవీలు, పైసలు, బుడ్డి అడిగే వారంటే ఆయనకు ఇష్టమని చెప్పారు.కేసీఆర్‌  ఫాంహౌస్‌లో మందు కొడుతుంటె ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాపలా ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు.  కేసీఆర్, మదన్‌రెడ్డిలు ఎత్తిపోస్తరు తప్ప ఎత్తిపోతల పథకాలు తేరని విమర్శిచారు.  కాగా టీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లాలో ఎవరి మీద లేని దృష్టిని నర్సాపూర్‌పై పెడుతారని, ఇక్కడికి పైసల మూటలు దించుతారని ఆయన వివరించారు.

రాబోయే 36రోజులు జాగ్రత్తగా ఉంటూ రాత్రి పూట యువకులు గస్తీ తిరగాలని, పగలంతా పార్టీ కోసం  పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.  కాగా ఇక్కడి నుంచి 8సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారన్నారు.   రోడ్‌ షోకు వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే ఈసారి సునీతారెడ్డిని గెలిపిస్తారన్న నమ్మకం తనకు కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.  నర్సాపూర్‌ ఎమ్మెల్యేగా తమ అభ్యర్తి సునీతారెడ్డిని గెలిపించాలని, తాను రెండో ఎమ్మెల్యేగా  అందరికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.    రాబోయె ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా నర్సాపూర్‌లో రెపరెపలాడాలని ఆయన కోరారు. ఆడబిడ్డకు అండగా వేల మంది బైక్‌లపై తరలి రావడ మంటే సునీతారెడ్డి  మామ రాంచంద్రారెడ్డి, భర్త దివంగత లక్ష్మారెడ్డిల ఆశయాలకు అనుగుణంగా ఆమె చేసిన సేవలకు గుర్తింపుగానేనని ఆయన చెప్పారు.  ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలం చెందారని ఆయన ఆరోపించారు. కాగా మాజీ మంత్రి సునీతారెడ్డి తన హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. 

ప్రజలకు సేవకురాలిగా..
తన జీవితం ప్రజా సేవకే అంకితమని మాజీ మంత్రి సునీతారెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బైక్‌ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాను నాయకురాలిని కాదని, ప్రజలకు సేవకురాలిగా మీ ముందుకు వచ్చానన్నారు. తనను నమ్మిన ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే తాను వారికి అందుబాటులో ఉంటానని ఆమె చెప్పారు.  మీ సహాయ సహకారాలు చాల గొప్పవని,  జీవితానికి చాలునని, తాను ధన్యురాలినని సునీతారెడ్డి చెప్పారు.  కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ తాము మంజూరు చేయించామని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రకటించుకుంటున్నారని  ఆరోపించారు.
కాగా తాను 15సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వస్తారా? అని ఆమె టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు.  టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో  నర్సాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధిలో మరో 15 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. పార్టీ కోసం   బైక్‌ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ   చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
బైక్‌ ర్యాలీ శివ్వంపేట నుంచి నర్సాపూర్‌ రాగానే స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి, సునీతారెడ్డిల వాహనాన్ని నిలిపి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిదులు మాణయ్య, ఆంజనేయులుగౌడ్, బ్లాక్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు మహెందర్‌రెడ్డి, మండల పారీ అద్యక్షుడు మల్లేశం, సంతోష్‌రెడ్డి, ప్రభాకర్, జయశ్రీ, లలిత తదితరలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top