సందడిలో చిరుతిళ్లు

Ramadan Snacks Special in Hyderabad - Sakshi

నోరూరిస్తున్న   దహీవడ

శాలిబండ: సాధారణ రోజుల్లో కంటే రంజాన్‌ నెలలో చార్మినార్‌ పరిసరాలు ప్రత్యేంగా ఉంటాయి. వివిధ రకాల వ్యాపారాలతో సందడిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నెలరోజులు చిరు వ్యాపారులకు భలే గిరాకీ ఉంటుంది. ఉపవాస దీక్షలు ముగిశాక ఇఫ్తార్‌ విందు చేస్తారు. ఇక పిల్లలైతే చార్మినార్, మక్కా మసీద్‌ చుట్టుపక్కల దొరికే చిరు తిళ్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తక్కువ ఖరీదుతో అందుబాటులో ఉండడంతో ఇలాంటి వాటికే సాధారణ ప్రజలు, పిల్లలు మొగ్గుచూపుతున్నారు. ఉపవాస దీక్షల విరమణ అనంతరం మిర్చీ బజ్జీలు, ఆలు బొండా, ఆలు బజ్జీలు, పుణుగులు, కచోరీ, సమోసా, వడలను ఇష్టంగా తింటుంటారు. రోజంతా ఉపవాస దీక్షలో ఉన్న వారందరూ వీటి కోసం ఎగబడతారు. దీంతో పాతబస్తీలో మిర్చీ బండీలతో పాటు పిండి వంటల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి.  

వేసవి ప్రత్యేకం ‘దహీవడ’
ఈసారి రంజాన్‌ మాసం వేసవిలో మొదలవడంతో చల్లదనానిచ్చే ‘దహీవడ’న అధికమంది ఇష్టపడుతున్నారు. పైగా ఈ వంటకం ధర కూడా తక్కువగా ఉండడంతో చాలామంది ఇష్టంగా లాగించేస్తున్నారు. సూర్యోదయానికి ముందు సహర్‌తో ఉపవాస దీక్షలను ప్రారంభించిన అనంతరం రోజుకు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేసే ముస్లింలు మగ్రీబ్‌ నమాజు అనంతరం ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. ఇఫ్తార్‌లో పిండి వంటలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. తక్కువ ధరలకు లభించే ఈ పిండివంటల పట్ల పేద ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారని, వారి నుంచే తమకు గిరాకీ ఉంటుందని మూసాబౌలికి చెందిన వ్యాపారి తిరుపతి శ్రీనివాసరావు, నర్సింగరావు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top