పరీక్ష ఫీజుల్లోనూ కక్కుర్తే! | Private college fees robbery from students | Sakshi
Sakshi News home page

పరీక్ష ఫీజుల్లోనూ కక్కుర్తే!

Nov 17 2017 3:28 AM | Updated on Nov 17 2017 3:54 AM

Private college fees robbery from students - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుపేద కుటుంబానికి చెందిన వీరేంద్ర తన కొడుకు నీరజ్‌ను అప్పు చేసి మరీ కొద్దిగా పేరున్న ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలో చేర్పించారు. ఏటా రూ. 30 వేల చొప్పున చెల్లించేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు పరీక్ష ఫీజు చెల్లించే సమయం వచ్చే సరికి రూ.3 వేలు చెల్లించాలని యాజమాన్యం చెప్పింది. అదేంటి పరీక్ష ఫీజు రూ.450 ఉంటే రూ. 3 వేలు చెల్లించమని అడుగుతున్నారేంటి అని ప్రశ్నిస్తే అది అంతే... చెల్లించాల్సిందేనన్న సమాధానం వచ్చింది. దీంతో గత్యంతరం లేక ఆ మొత్తాన్ని చెల్లించారు.

హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి అయిన సురేష్‌ తన కొడుకు విజయ్‌ను బాగా చదివించాలన్న ఆశతో నగరంలోని ఓ కార్పొరేట్‌ కాలేజీలో గతేడాది ఎంపీసీలో చేర్చించారు. ఇపుడు ఆ విద్యార్థి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యాజమాన్యం రూ. 4 వేలు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పింది. ఇప్పటికే వార్షిక ఫీజుగా రూ. 45 వేలు చెల్లించిన సురేష్‌.. పరీక్ష ఫీజు అంతెందుకు ఉంటుందని ప్రశ్నిస్తే ‘మీ అబ్బాయి సెకండియర్‌ కదా... ప్రాక్టికల్స్‌ ఉంటాయి.. అందుకు ఇతర ఖర్చులుంటాయి.. చెల్లించాల్సిందేనని చెప్పారు. ఏం చేయాలో అర్థంకాక ఆ మొత్తాన్ని చెల్లించారు.

ఇలా రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు తమ వసూళ్ల దందాను చివరకు పరీక్ష ఫీజులోనూ కొనసాగి స్తున్నాయి. బోర్డు వార్షిక ఫీజు రూ.1,950 ఉంటే రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. పరీక్ష ఫీజుల విషయంలోనూ విద్యార్థుల తల్లిదం డ్రుల నుంచి భారీగా దండుకుంటున్నాయి. బోర్డు నిర్ణీత పరీక్ష ఫీజు కంటే 200 నుంచి 300 రెట్లు వసూలు చేస్తున్నాయి. సాధారణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు పరీక్ష ఫీజుకు అదనంగా రూ.1,000 వరకు వసూలు చేస్తుం డగా, పేరున్న ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్‌ కాలేజీలు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి.

నియంత్రణ లేని వ్యవస్థతో అవస్థలు
ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో వార్షిక ఫీజులు, పరీక్ష ఫీజుల వసూళ్లలో నియంత్రణ లేకపోవ డంతో యాజమాన్యాలు తల్లిదండ్రులను లూటీ చేస్తున్నాయి. అయినా ఇంటర్‌ బోర్డు ఫీజుల నియంత్రణపై దృష్టి సారించడం లేదు. ఫలితం గా నిరుపేద ప్రజలు, ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినా బోర్డు అధికారులు ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టట్లేదు. రాష్ట్రంలో 406 ప్రభు త్వ జూనియర్‌ కాలేజీలు ఉండగా, 1,550 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రైవేటు కాలేజీల్లోనే 7.5 లక్షల మంది చదువుతున్నారు. యాజమాన్యాలు ఇష్టా రాజ్యంగా చేస్తున్న వసూళ్లు ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయి.

అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు
తల్లిదండ్రుల ఫిర్యాదులతో యాజమాన్యాలు చేస్తున్న అధిక వసూళ్లపై ఇంటర్‌ బోర్డు స్పందిం చింది. నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ మొత్తం చెల్లించొద్దని సూచించింది. అధిక మొత్తం చెల్లించాలని అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని, అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకుంటామంది. 

ఇవీ బోర్డు నిర్ణయించిన పరీక్ష ఫీజులు
ప్రథమ సంవత్సరం ఆర్ట్స్, సైన్స్‌ విద్యార్థులకు రూ. 450
ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్‌ విద్యార్థులకు రూ. 450
ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు రూ. 610 (రూ. 450 థియరీకి, రూ. 160 ప్రాక్టికల్స్‌కు)
ప్రథమ, ద్వితీయ సంవత్సర వొకేషనల్‌ విద్యార్థులకు (ప్రాక్టికల్స్‌ కాకుండా అయితే) రూ. 450
ప్రథమ, ద్వితీయ సంవత్సర వొకేషనల్‌ విద్యార్థులకు (థియరీ రూ. 450, ప్రాక్టికల్స్‌ రూ. 160) మొత్తంగా రూ. 610. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement