నిజామాబాద్‌ వాసికి రూ. 28.4 కోట్ల లాటరీ

Nizamabad Man Vilas Wins Dubai Raffle - Sakshi

అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తికి నిరాశే మిగిలినప్పటికీ.. లాటరీ టికెట్‌ మాత్రం అతని జీవితాన్నే మార్చివేసింది. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్‌ రిక్కాల, పద్మ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే విలాస్‌ 45 రోజుల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లాడు. కానీ ఉద్యోగం లభించకపోవడంతో స్వదేశానికి తిరిగివచ్చేశాడు.

గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన విలాస్‌.. రెండేళ్లుగా అక్కడి ప్రముఖ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్న అతడు... లాటరీ టికెటు కొనుగోలు చేసే అలవాటును మానుకోలేకపోయాడు. తన చేతులో డబ్బులు లేకపోవడంతో భార్య పద్మ దగ్గరి నుంచి రూ. 20వేలు తీసుకుని.. లాటరీ టికెట్లు కొనుగోలు చేయాల్సిందిగా దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుడు రవికి చెప్పాడు.

దీంతో విలాస్‌ పేరు మీద రవి మూడు టికెట్లు కొనుగోలు చేశాడు. ఇక్కడే కీలక పరిణామం చోటుచేసుకుంది. అందులోని ఓ టికెటు.. విలాస్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. యూఏఈలో అతను భారీ లాటరీ గెలుపొందినట్టు విలాస్‌కు ఫోన్‌ వచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ లాటరీలో విలాస్‌ ఏకంగా 4.08 మిలియన్‌ డాలర్లు(రూ. 28.4 కోట్లు) సొంతం చేసుకున్నాడు. విలాస్‌ మాత్రం ఈ సంతోష క్షణాలకు తన భార్యే  కారణమని చెప్పాడు. కాగా, విలాస్‌, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు హిమానీ ఇంటర్మీడియట్‌, చిన్న కూతురు మనస్విని 8వ తగరతి చుదువుతున్నారు. ఈ మేరకు గల్ఫ్‌ న్యూస్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top