మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట వరకు నిర్మించనున్న 365వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో
అర్వపల్లి/హాలియా: మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట వరకు నిర్మించనున్న 365వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా జిల్లాలో నకిరేకల్ నుంచి నూతనకల్ మండలం తానంచర్ల వరకు నిర్మించనున్న రో డ్డు నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి. జిల్లాలో నూతనకల్ మండలం నుంచి ఈ రహదారి ప్రారంభమై నాగార్జునసాగర్‌లో గుంటూరు జిల్లాకు కలుస్తుంది. అయితే నూతనకల్ నుంచి నకిరేల్ వరకు కొన్ని ఇబ్బందులుండేవి. దీంతో భూ సేకరణ జరగలేదు. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయాయి. నకిరేకల్, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, తుంగతుర్తిల మీదుగా నూతనకల్ మండలంలోని బిక్కుమళ్ల వరకు 70కిలోమీటర్ల పొడవున ఈ జాతీయ రహదారిని నిర్మిస్తారు.
అయితే మొన్నటివరకు ఈ రోడ్డును నకిరేకల్ నుంచి వర్ధమానుకోట, మూసీ వాగు, నాగారం మీదుగా తుంగతుర్తికి నిర్మించాలని అక్కడి గ్రామాల ప్రజలు కోరడంతో వంగమర్తి-జాజిరెడ్డిగూడెం, వర్ధమానుకోట- నాగారం రెండు చోట్ల అధికారులు సర్వే చేశారు. ఈసర్వేతో రోడ్డు నిర్మాణ ప్రక్రియ పనులు కొంత ఆలస్యమయ్యాయి. అయితే వర్ధమానుకోట నుంచి నిర్మాణం సాధ్యం కాదని జాతీయ రహదారి అధికారులు తేల్చడంతో అర్వపల్లి-తుంగతుర్తి రూట్లో రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. నకిరేకల్ నుంచి జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, తుంగతుర్తి, నూతనకల్ మండలం బిక్కుమళ్ల వరకు భూసేకరణ ప్రక్రియ కూడా అధికారులు ప్రారంభించారు.
ఈ రోడ్డు రూట్ ఇదే...
365వ నంబర్ రహదారి జిల్లాలోని నకిరేకల్-బాబాసాహెబ్‌గూడెం, కడపర్తి, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, తుంగతుర్తి, కర్విరాల, మద్దిరాల ఎక్స్‌రోడ్డు, ఎర్రపహడ్, పెదనెమిల, బిక్కుమళ్ల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం సింగిల్ రోడ్డుగా ఉన్న ఈరహదారిని డబుల్ రోడ్డుగా మార్చుతారు. అలాగే జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తిలలో బైపాసు రోడ్లను నిర్మించనున్నారు. గ్రామాల్లో ఈరోడ్డు 100ఫీట్ల వెడల్పు, మండల కేంద్రాలలో 150 ఫీట్ల వెడల్పు ఉంటుందని జాతీయ రహదారుల అధికారులు చెబుతున్నారు. కాగా జాజిరెడ్డిగూడెం-వంగమర్తి మధ్య మూసీ వాగులో వంతెన నిర్మాణానికి ఇప్పటికే అధికారులు మట్టి పరీక్ష నిర్వహించారు. భూసేకరణ పూర్తి చేశాక రోడ్డు పనులు ప్రారంభించడానికి జాతీయ రహదారి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నకిరేకల్ నుంచి సాగర్ వరకు పనులు చకచకా..
నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు 86 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చకచకసాగుతున్నాయి. రూ. 200 కోట్లతో చేపట్టిన రోడ్డు విసర్తణ పనులను జీవీఆర్ కంపెనీ దక్కించుకుంది. రోడ్డును 10 మీటర్ల మేర రోడ్డు విస్తరించాల్సి ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనులను జీవీఆర్ కంపెనీ ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాల్సి ఉంది. మూడు మాసాలుగా 25 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. రోడ్డు వెంట ఉన్న చెట్లను నరికివేయడంతో పాటు ఇరువైపులా పాతమట్టిని తీసి కొత్తమట్టిని నింపుతున్నారు. బీటీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. పనులు ఇలాగే సాగితే నాగార్జునసాగర్ సమీపంలో ఘాట్ రోడ్డు మినహా ఆరు నెలల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.